Vellamma Kunta pond in Bachupalli :  కాదేదీ ఆక్రమణలకు అనర్హం అన్నట్లుగా హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లాల పరిధిలో చెరువులు ఇష్టానుసారం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారుకొందరైతే చెరువులను  రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పావులుగా చేసుకున్న వారు మరికొందరు.  ఇప్పటికే హైడ్రా దూకుడు ఆక్రమణదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అయితే ఇంకా అనేక ప్రాంతాల్లొో చెరువుల ఆక్రమణకు పాల్పడ్డ కబ్జా గ్యాంగ్ మేం సేఫ్ అనుకుంటూ లైట్ తీసుకుంటున్నారు. అవే పనులు చేస్తున్నారు. 


బాచుపల్లిలో వెల్లమ్మ కుంట చెరువులో ఆక్రమణలు 


బాచుపల్లిలోని  వెల్లమ్మకుంట చెరువు మంచినీటి చెరువు, ధీని పూర్తి విస్తీర్ణం ఎనిమిదిన్నర ఎకరాలుగా 2013లో HMDA నోటిఫై చేసింది. ఇప్పుడు చూస్తే చెరువుకు చెందిన ఎఫ్ టిఎల్ పరిధిలో దుకాణాలు వెలశాయి. రేకుల షెడ్డులు వేిసి దాదాపు చెరువు చుట్టు ప్రక్కల ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. బఫర్ జోన్ కూడా కలుపుకుంటే ఈ చెరువు మొత్తం విస్తీర్ణం పదకొండు ఎకరాలకు పైగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిధి పూర్తిగా తగ్గిపోయి ఆక్రమణలకు గురయింది. గతంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఈ చెరువును సర్వే చేసి ఎప్ టిఎల్ పరిధిని ఫిక్స్ చేసి ఆ మాప్స్ ను ఆన్ లైన్ లో సైతం అప్ లోడ్ చేశారు. 


స్థానిక ప్రజా ప్రతినిధుల కక్కుర్తి 


ఆ తరువాత ఇక్కడి స్దానిక ప్రజాప్రతినిధులు ఎనిమిదన్నర ఎకరాల ఎఫ్ టిఎల్ పరిధిని ఆక్రమించి , మూడున్నర ఎకరాలు మాత్రమే చెరువుగా వాళ్లే నిర్ణయించి, మిగతా ఐదు ఎకరాలకు ఫెన్సింగ్ వేసి ఆక్రమించుకున్నారు.  దీనిపై స్దానికంగా ఉన్న వెల్లమ్మకాలనీ, శ్రీవంశీ కాలనీల ప్రజలు అనేక సార్లు ఫిర్యాదు చేశారు. పోరాటం చేసినా ఫలితం లేదు. అధికారులు వచ్చినా గతంలో పట్టించుకోలేదు.ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదని కాలనీల వాసులంటున్నారు. 



చెరువులోకి నీరు రాకుండా నిర్మాణాలు


బాచుపల్లి రెడ్డీస్ ల్యాబ్,  మమత కాలేజి నుండి వచ్చే వర్షపు నీరు వెల్లమ్మబావి కుంట చెరువులోకే వస్తుంది. ఆ వరద నీరు చెరువులోకి రాకుండా మధ్యలోనే అక్రమ కట్టడాల ద్వారా వరద నీటిని అడ్డుకోవడంతో కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. ఈ చెరువునుండే వరద నీరు శ్రీరామ్స్ కాలనీ మీదుగా బొల్లారం అవుట్ లెట్ లోకి వెళుతుంది. ఈ చెరువను కాపాడితే ఇక్కడున్న శ్రీరామ్స్ కాలనీ, నందనం హిల్స్ ,దేవి హిల్స్, నందవనం కాలనీ,క్రాంతినగర్ ,కేఆర్ సి కాలనీలకు వరదముంపు తగ్గుతుంది. స్దానికులకు ఎంతో ఉపయోగపడుతుంది.


మీడియాపై కబ్జాబాబుల దౌర్జన్యం..


వెల్లమ్మకుంట చెరువుపై స్దానికులు మాట్లడుతున్న సమయంలోనే కవరేజ్ వద్దకు చేరుకున్న అవినాష్ అనే వ్యక్తి కవరేజ్  ను అడ్డుకోవడమే కాకుండా.. చెరువు ఆక్రమణలపై బ్లూప్రింట్ పేపర్ లను బలవంతంగా గుంజుకోవడంతోపాటు స్దానికులపై దౌర్జన్యం చేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.చెరువు ప్రక్కన తనకు చెందిన స్దలం ఉందంటున్న అవినాష్ మాత్రం ఆధారాలు చూపంటే నివ్వెరపోయిన పరిస్దితి. తాను చెరువును కొంత ఆక్రమించుకోవడం మాత్రం వస్తమని, హైడ్రా కోరితే ఆక్రమించిన స్దలం వదిలేస్తానంటూ ఏబిపితో అన్నారు.


వెల్లమ్మకుంట చెరువు కబ్జాకథ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే హైడ్రా బుల్డోజర్ బాచుపల్లి రావాల్సిందే. ఇక్కడ వెల్లమ్మకుంటలో ఆక్రమార్కుల లెక్కలు తేల్చాల్సిందేనని స్దానికులు డిమాండ్ చేస్తున్నారు..


న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం - సుప్రీంకోర్టు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి వివరణ