హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోరైలు సెకండ్ ఫేజ్ మలిభాగం(2 బి) పై కసరత్తు చేస్తోంది. మెట్రో రెండో దశ మలిభాగం కోసం దాదాపు రూ.19వేల కోట్ల అంచనాలతో డీపీఆర్ సిద్ధమైంది. మొత్తం 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్‌ను ప్రతిపాదించారు. జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు, జేబీఎస్ నుంచి మేడ్చల్‌కు, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు మార్గాల పూర్తి వివరాలను ఇందులో చేర్చారు. ఓవరాల్‌గా 3 మార్గాల జంక్షన్‌గా ఉన్న జేబీఎస్ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగినట్లుగా అధికారులు మెట్రో ఎలైన్‌మెంట్‌ను డిజైన్ చేశారు.
హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ మలిభాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(DPR)లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్(HAML) బోర్డు ఇటీవల ఆమోదం తెలిపిందని తెలిసిందే. దాంతో ఆ డీపీఆర్ నివేదిక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వద్దకు చేరింది. వచ్చే కేబినెట్ భేటీలో హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ మలిభాగంపై చర్చించి ఆమోదించనున్నారు. ఆపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించనుందని అధికారులు చెబుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టు.. బ్యాంకుల నుంచి 48 శాతం రుణాలుహైదరాబాద్ మెట్రోరైలు సెకండ్ ఫేజ్ రెండో భాగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టేలా డీపీఆర్ డిజైన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఖర్చులు భరించనుండగా, కేంద్ర ప్రభుత్వం 18 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు 48 శాతం, మిగిలిన 4 శాతాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భాగంగా సమకూర్చుకునేలా అధికారులు డీపీఆర్ రూపొందించారు.
జేబీఎస్ నుంచి శామీర్‌పేట, జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు, శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ మార్గాలకు వేర్వేరుగా డీపీఆర్‌లను సిద్ధం చేశారు. ఈ ఫేజ్ మెట్రో పనుల్లో ఎలాంటి డబుల్ డెక్‌ని ప్రతిపాదించలేదు. గతంలో జేబీఎస్-మేడ్చల్ రూట్, జేబీఎస్-శామీర్‌పేట మార్గాల్లో డబుల్ డెక్ స్తంభాలను వేయాలని అధికారులు భావించారు. ఓ అంతస్తులో రహదారి, రెండో అంతస్తులో హైదరాబాద్ మెట్రో నిర్మించాలని భావించారు. కానీ మెట్రోస్టేషన్లు చాలా ఎత్తులో నిర్మించాల్సిన కారణంగా అందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ విముఖత వ్యక్తం చేయడంతో ఎలాంటి డబుల్ డెక్ లేకుండా డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీ (Future City) వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ ప్రతిపాదించారు. ఎయిర్‌పోర్ట్ టర్మినల్ స్టేషన్ అండర్‌గ్రౌండ్‌లో ఉంటుంది. ఈ మార్గంలో రావిర్యాల హైదరాబాద్ ఓఆర్‌ఆర్ (Hyderabad ORR) వరకు ఎలివేటెడ్‌లో మెట్రో వెళ్ళాలని ప్లాన్ చేశారు. అక్కడి నుంచి ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూ మార్గంలోనే 18 కిలోమీటర్ల మేర మెట్రో వెళ్లేలా డీపీఆర్ సిద్ధమైంది.
జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 22 కి.మీ మెట్రో ప్రతిపాదించారు. జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, హకీంపేట, తూంకుంట మీదుగా శామీర్‌పేటకు మెట్రో లైన్ డీపీఆర్ సిద్ధం చేశారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ రన్‌వే రహదారి పక్కనే ఉండటంతో పాటు ఎలివేటెడ్ కారిడార్‌కు డిఫెన్స్ సంస్థల అధికారులు అభ్యంతరం తెలపడంతో దాదాపు 1.5 కిలోమీటర్ వరకు అండర్ గ్రౌండ్ నుంచి మెట్రో లైన్‌ను ప్రతిపాదించారు. హకీంపేట రన్‌వే కింద నుంచి హైదరాబాద్ మెట్రో వెళ్లేలా డీపీఆర్‌లో డిజైన్ చేశారు.
జేబీఎస్ నుంచి మేడ్చల్‌కు 24.5 కి.మీ. మేర మెట్రో లైన్ ప్రతిపాదించారు. జేబీఎస్ నుంచి తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్‌కు డీపీఆర్ సిద్ధం చేశారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంలో జేబీఎస్ నుంచి ప్రస్తుతం ఉన్న దానికన్నా తక్కువ ఎత్తులో వెళ్లనుంది.