మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్, ములుగు జిల్లాల పర్యటనకు రానున్నారని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజాగ్రహానికి గురిచేస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా? అని రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. 

రోజువారీ కూలి పనులు చేసుకుని జీవించే నిరుపేద ప్రజల ఇండ్లతో పాటు వారి జీవనోపాధిని నాశనం చేయడానికి నిరంతర ప్రయత్నం చేయడానికి కారణం ఏంటి ? వరంగల్‌లో కూల్చివేతలు ఎందుకు జరుగుతున్నాయని రాహుల్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. ఈరోజు (మే 14న) మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించే మార్గాన్ని 'అందం'గా చేయడానికి అని ప్రజలకు చెబుతున్నారు. అలాంటి చర్యలు చేస్తున్న మీ కాంగ్రెస్ నేతలు మీది ప్రజా పాలన అని, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలంటూ ఘాటుగా స్పందించారు. 

రాజభవనాలలో విలాసవంతమైన విందులు, మరోవైపు 200 కోట్ల రూపాయలకు పైగా ప్రజా ధనాన్ని వృథా ఖర్చు చేశారు. బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చివేస్తున్నారు. పేదల జీవితాలను బుల్డోజర్ల కింద ఎందుకు నలిపేయాల్సి వచ్చింది?. మీ సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం మేం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

కేటీఆర్ షేర్ చేసిన వీడియోలో ఏముందంటే.. రోడ్డు పక్కన ఉన్న పేదల గుడిసెలు, వారి చిన్న చిన్న షాపులను సిబ్బంది తొలగిస్తున్నారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో పాల్గొనే అందెగత్తెలు నేడు వరంగల్ జిల్లాకు రానున్నారు.  ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వెయ్యి స్తంభాల గుడి, రామప్ప టెంపుల్ లాంటి  ప్రముఖ కట్టడాలను వారు సందర్శించనున్నారు. దాంతో తమ లాంటి పేదలకు నష్టం కలిగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. వారెవరో విదేశాల నుంచి అందగత్తెలు వస్తే మాకు అన్యాయం ఎందుకు చేస్తున్నారు. మా పొట్ట ఎందుకు కొడుతున్నారు. కాంగ్రెస్ కు ఓట్లు వేసింది మేమా, లేక మిస్ వరల్డ్ అందెగత్తెలు వచ్చి ఓట్లు వేశారా అని కొందరు పేదలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.