Letter To Rahul: తెలంగాణలో విగ్రహాల పంచాయితీ మరింత ముదురుతోంది. సెక్రటేరియట్‌లో రాజీవ్‌ గాంధీ విగ్రహం పెట్టాలన్న ప్రభుత్వ ప్రతిపాదన తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే దీనిపై బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెకలించి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని కేటీఆర్ ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ మేథావుల పేరుతో కొందరు రచయతలు, కవులు, కళాకారులు ఏకంగా రాహుల్ గాంధీకి లేఖ రాశారు. 
తెలంగాణ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదని అక్కడ ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహమని తెలంగాణ మేథావులు చెప్పుకొచ్చారు. తెలంగాణ అస్తిత్వ వైభవానికీ, స్వరాష్ట్ర ప్రతిపత్తికీ, స్వాభిమానానికీ, సాధికారతకు ప్రతీక తెలంగాణ తల్లి అని వివరించారు.  తెలంగాణ తల్లి ప్రస్తావన ఈనాటిది కాదని... తెలంగాణ రైతాంగ పోరాటం కాలంలోనే దాశరథి, రావెళ్ళ వెంకటరామారావు వంటి కవులెందరో తెలంగాణ తల్లిని ప్రస్తుతిస్తూ పద్యాలూ, పాటలూ రాశారని గుర్తు చేశారు. 


అప్పుడు నిరాదరణ- ఇప్పుడు ఆదరణ 


ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణ తల్లి భావన తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పునర్జీవం పొందిందన్నారు. సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు విరుద్ధంగా, సమైక్య రాష్ట్ర ప్రతీకగా తెలుగుతల్లిని కించపరిచారన్నారు. కనపడనీయకుండా చేశారని వివరించారు. అలాంటి సమయంలో తెలంగాణ మేథావులు, సాహిత్యకారులు, కళాకారులూ తెలంగాణ తల్లి రూపురేఖలను గురించి చర్చించి ఓ రూపం తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఉద్యమకారులు స్వచ్ఛందంగా తెలంగాణ వ్యాప్తంగా వేల విగ్రహాలను ప్రతిష్ఠించారని తెలిపారు. తెలంగాణ తల్లి ఈ మట్టిలోనుంచి, తెలంగాణ ఉద్యమ భావోద్వేగాల నుంచి పుట్టిందని అభిప్రాయపడ్డారు. 


అస్తిత్వ ప్రతీక


సమైక్య రాష్ట్ర అస్తిత్వ ప్రతీకగా తెలుగుతల్లి విగ్రహం గతంలో సెక్రటేరియట్ ముందు ఉండేదని లేఖలో మేథావులు వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త సెక్రటేరియట్ భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటం చారిత్రక న్యాయమని అభిప్రాయపడ్డారు. సెక్రటేరియట్‌కు అమరవీరుల స్మారక కేంద్రానికి మధ్యనున్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలంగాణ కవులు, కళాకారులు, పాత్రికేయుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. 
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే ప్రభుత్వ ఆలోచన పట్ల అభ్యంతరాలున్నాయని తెలిపారు. రాజీవ్ గాంధీ మీద గౌరవం ఉందని ఆ విగ్రహం పెట్టాలనే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ఆలోచన పట్ల అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండవలసిన చోట కాకుండా మరెక్కడైనా ప్రతిష్ఠించాలని విజ్ఞప్తి చేశారు. 


Also Read: మేం మళ్లీ అధికారంలోకి రాగానే ఎయిర్ పోర్టు పేరు మార్చేస్తాం - కేటీఆర్


సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పినప్పుడే తెలంగాణ అస్తిత్వ ప్రతీకకు కావాల్సిన సాధికారత, ప్రతిపత్తి సిద్ధిస్తుందన్నారు. తెలంగాణ చరిత్రతో ప్రత్యక్ష సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ భావోద్వేగాలు గాయపర్చవద్దని కోరారు. తెలంగాణ సాంస్కృతిక ఆకాంక్షలను గౌరవిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని.. దానిని నిలుపుకొంటూ సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేలా సీఎం రేవంత్ రెడ్డికి సూచిస్తారని కోరారు. 


Also Read: రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు