BRS Latest News: తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే శంషాబాద్ ఎయిర్ పోర్టు పేరును మార్చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. అంతేకాక, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా తొలగిస్తామని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం కోసం స్థలం కేటాయించామని.. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతుండడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.


బీఆర్ఎస్ 2014లో అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు పేరును మార్చలేదని గుర్తు చేశారు. అలాగే మరే ఇతర విషయాల్లో పేర్లు మార్చలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరు కారణంగా తాము అధికారంలోకి రాగానే ఎయిర్ పోర్టు పేరును మార్చేస్తామని హెచ్చరించారు.




‘‘తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో పెడుతున్న ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం. గతంలో మేం ఉన్నపుడు సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించిన స్థలంలో పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. గతంలో మేము అధికారంలో ఉన్నా కూడా రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మార్చలేదు.. కానీ తర్వాత మేం అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ పేరు తీసేసి పీవీ నరసింహారావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ లేదా మరే తెలంగాణ బిడ్డ పేరు అయినా మార్చుతాం’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘన నివాళి
‘‘తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో  ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని కేటీఆర్ మరో పోస్టు చేశారు.