Telangana RTC e Super Luxury Buses: తెలంగాణ ఆర్టీసీ తన బస్సుల శ్రేణిని అప్ గ్రేడ్ చేస్తూనే ఉంది. పాతబడ్డ బస్సుల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త బస్సులను ప్రవేశపెడుతూనే ఉంది. గతేడాది ఈ-గరుడ, కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ లో పదుల సంఖ్యలో ఏసీ, నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను కూడా తిప్పుతోంది. తాజాగా జిల్లాలకు నడిపే నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సుల స్థానంలో ఈ-సూపర్ లగ్జరీ బస్సులను తీసుకురానుంది. కరీంనగర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - కరీంనగర్ మధ్య ఈ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. 


తొలిదశలో కరీంనగర్‌ - హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, నిజామాబాద్‌ - హైదరాబాద్‌ లేదా సికింద్రాబాద్ మార్గాల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీటికి ఈ-సూపర్‌ లగ్జరీగా పేరు పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే కరీంనగర్‌-2 డిపోకు 35 ఎలక్ట్రిక్ బస్సులు, నిజామాబాద్‌-2 డిపోకు 13 ఎలక్ట్రిక్ బస్సులు చేరుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 


అయితే, ఈ బస్సుల్ని ఆర్టీసీ కొనుగోలు చేయకుండానే తిప్పుతోంది. ప్రైవేటు సంస్థల నుంచి ఆర్టీసీ.. ఎలక్ట్రిక్‌ బస్సుల్ని అద్దె ప్రాతిపదికన తీసుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో సిటీ బస్సులు, హైదరాబాద్‌-విజయవాడ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో ఏసీ, నాన్‌ ఏసీ మెట్రోడీలక్స్‌ బస్సులు ఉన్నాయి. సూపర్‌ లగ్జరీలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. త్వరలోనే వీటిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించనున్నారు. 


ఆర్టీసీ సంస్థకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవసరమైన మేరకు కొత్త బస్సులను కొనుగోలు చేయడం కష్టంగా మారింది. కానీ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో వెనకడుగు వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలవైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే డీజిల్‌ బస్సుల నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త బస్సులు కొనే ఖర్చు అధికంగా ఉండడం కారణంగా.. అద్దె పద్ధతిలో ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకుంటున్నారు. వీటిల్లో డ్రైవర్లుగా బస్సు తయారీ సంస్థ సిబ్బందే ఉండనున్నారు. కండక్టర్లు మాత్రం ఆర్టీసీ సంస్థ నుంచి ఉండనున్నారు. ఈ బస్సులకు కిలో మీటర్ల వారీగా ఆర్టీసీ అద్దె చెల్లిస్తూ ఉండనుంది.