Mpox (Monkeypox) | హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆందోళన పెంచుతున్న మంకీపాక్స్ వ్యాప్తిపై తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఆదివారం మంకీపాక్స్ పై సమీక్షించి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దాంతో రాష్ట్రంలో మంకీపాక్స్ ప్రస్తుత పరిస్థితి, అప్రమత్తత ముందు జాగ్రత్త చర్యలపై అధికారులతో సమీక్షించారు. తెలంగాణలో ఇప్పటివరకూ మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మంకీపాక్స్ నివారణకు, చికిత్సకు కావాల్సిన చర్యలు చేపట్టాలని.. ఎంపాక్స్ పై అప్రమత్తంగా ఉండాలన్నారు.
దేశ సరిహద్దుల్లోనూ అలర్ట్
పాకిస్తాన్, బంగ్లదేశ్ సరిహద్దుల్లోని ఎయిర్ పోర్టులు, ఇతరత్రా మార్గాల్లో ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులైన ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్ జంగ్ హాస్పిటల్, లేడి హార్డింగ్ హాస్పిటల్స్ లో క్వారంటైన్ కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపించినా, ఎంపాక్స్ సోకినట్లు కనిపించినా వారిని ఇక్కడికి తరలించి చికిత్స అందించనున్నారు.
భారత్‌లో ఒక్క మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. కేసులు నమోదు అయితే తక్షణం చర్యలు తీసుకుని, చికిత్స అందించాలని నోడల్ సెంటర్లకు సమాచారం అందించాలని సూచించారు. అయితే మన దేశంలో ఇప్పటివరకూ ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఎంపాక్స్ వ్యాప్తి కారణంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఎంపాక్స్ కేసుల్ని నిర్ధారించేందుకు 32 ల్యాబోరేటరీలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.
Also Read: Rythu Runa Mafi: రైతు రుణమాఫీ ఇంకా పెండింగ్ కు కారణం చెప్పిన మంత్రి ఉత్తమ్, త్వరలో వారికి సైతం