Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. రెండు రోజుల నుంచి అప్పుడప్పుడూ కురుస్తున్న వాన నగర వాసులను ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే రాత్రి నుంచి మాత్రం దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు ఏకధాటిగా కురుస్తోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రి నుంచి గ్యాప్ ఇవ్వకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో అసలు రోడ్డు కనిపించకుండా మోకాళ్ల లోతున నీరు ఉండిపోయింది. ఉదయాన్నే ఆఫీసలకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదొర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల పరిస్థితి సరే సరి. బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కోతలు కూడా విధించారు.
రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. సోమవారం, ఆదివారం సాయంత్రం కురిసిన వర్షాలకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడ చూసిన బారులు తీరిన వాహహనాలు కనిపించాయి. ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లే టైంలో కురుస్తున్న వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కూడా వర్షంతో జనం సమస్యలు ఎదుర్కొన్నారు.
ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. రాత్రి మొదలైన వాన ఇంకా కురుస్తూనే ఉంది. అమీర్‌పేట, కోఠీ, జూబ్లీహిల్స్, షేక్‌పేట, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, బాలానగర్, ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా వాన కుమ్మేస్తోంది. చాలా ప్రాంతాల్లో కార్లు బైక్‌లు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. మ్యాన్‌హోల్ లో నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.
మరో నాలుగు రోజల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం ఖాయమని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ముసురు పట్టింది లేదని అనుకుంటున్న టైంలో రెండు రోజులుగా ముసురు పట్టుకుంది. ఇంటి నుంచి కదలకుండా చేస్తోందీ వాన. అయితే ఇంత వర్షం కురుస్తున్నా ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. వర్షం కంటిన్యూగా పడుతున్నా ఏసీ, ఫ్యాన్ లేకుంటే ఉక్కపోతకు జనాలు గురవుతున్నారు.