Revanth Reddy : తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు భారీ ఆస్తినష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పంటలు నీట మునిగాయని వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ముందు ముంపు ప్రాంతాల ప్రజలకు సాయం చేయడంపైనే యంత్రాంగమంతా దృష్టి పెట్టింది. ఈ సహాయ కార్యక్రమాలు కొలిక్కి వచ్చిన తర్వాత మిగతా వాటిపై దృష్టి పెట్టనున్నారు.
20 మంది మృతులు
ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో వర్షలు, వరదల కారణంగా దాదాపు 20 మంది చనిపోయినట్టు గుర్తించింది. ఐదు వేల మందికిపైగా ప్రజలకు నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో ఉంటున్నట్టు లెక్కకట్టింది. ఇంకా పలు ప్రాంతాలు వరద నీటిలో ఉన్నందున ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మరికొందర్ని ఈ పునరావాసాలకు తరలిచే అవకాశం లేకపోలేదని అధికారులు అంటున్నారు. అదే టైంలో పంట నష్టం కూడా భారీగా జరిగినట్టు లెక్కగడుతున్నారు. మునిగి ప్రాంతాలను పరిశీలిస్తే దాదాపు ఆరువేల కోట్లు నష్టం వాటిల్లినట్టు అభిప్రాయపడుతున్నారు.
మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వానలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రోడ్లను నామరూపాల్లేకుండా చేశాయి. పంట పొలాలు నదులను తలపిస్తున్నాయి. భవనాల్లోని రెండో అంతస్తుల్లోకి నీరు వచ్చి చేరింది. చెరువులకు చాలా ప్రాంతాల్ల గండ్లు పడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విధ్వంసం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. బాధిత ప్రజలు కోలుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల బృందాలు పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు.
4 లక్షల ఎకరాల్లో నష్టం
వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాల్లో ప్రధానమైంది పంట నష్టాలు. సమారు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని ఇంకా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే మాత్రం ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన నాలుగున్నర కోట్లపైగానే నిధులు కావాల్సి ఉంటుంది. వరద నష్టాల్లో ఇది ప్రధానమైంది.
వేల సంఖ్య దెబ్బతిన్న ఇళ్లు
వరద నష్టాల్లో రెండో ప్రధానమైంది దెబ్బతిన్న భవనాలు. ఇప్పుడు చాలా మంది ప్రజల ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరికొన్ని నీట మునిగి దెబ్బతిన్నాయి. వాటిని గుర్తించి వారికి పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై కూడా ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. ఇలా దెబ్బతిన్న భవనాల్లో ప్రభుత్వ భవనాలు కూడా ఉంటాయి. ఇవి మాత్రం నేరుగా వెళ్లి పరిశీలించిన తర్వాత అంచనాకు రాగలమని అధికారులు చెబుతున్నారు.
రోడ్లు విధ్వంసం చాలానే ఉంది
వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు దీని నష్టం రెండువేల కోట్లకుపైగానే ఉంటుందని, వంతెనలు మరో ఏడు వందల కోట్లు నష్టం జరిగి ఉంటుందని అంటున్నారు. పంచాయతీ రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్ల పునరుద్ధరణకు దాదాపు 200 కోట్లు అవసరం అవుతాయని అధికారులు లెక్కగడుతున్నారు. వరదల కారణంగా ట్రాన్స్‌కోకు భారీ నష్టం వాటిల్లింది. ఎక్కడికక్కడ వైర్లు తెగిపడ్డాయి. స్తంభాలు కూలిపోయాలి. ట్రాన్స్‌ఫార్మర్స్ దెబ్బతిన్నాయి. విద్యుత్ సబ్‌స్టేషన్లు కూడా నీట మునిగిపోయాయి. ఈ రిపేర్ల కోసం దాదాపు 150 కోట్లకుపైగానే నిధులు అవసరం అవుతాయి.
వీటితోపాటు ఆసుపత్రుల్లో జరిగినష్టం, వీధిలైట్లు, డ్రైనేజీలు, ఇతర నష్టాలు దాదాపు 15 వందల కోట్లకుపైగానే ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు అధికారులు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఆరు వేల కోట్ల వరకు నష్టాన్ని ఇప్పటికి అంచనా వేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వాతావరణ హెచ్చరికలతో అప్రమత్తమై ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని ఆస్తి నష్టాన్ని మాత్రం తగ్గించలేకపోయామని అంటున్నారు.
వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులను యుద్ధప్రాతిపదికన అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. రైల్వే ట్రాక్‌లను కూడా పునరుద్ధరించారు. కేసముద్ర మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను పునర్‌నిర్మించే పనులు విస్తృతంగా సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద దెబ్బతిన్న పాలేరు బ్రిడ్జిని రిపేర్ చేసి రాకపోకలకు అనుమతిచ్చారు. దీన్ని గంటల వ్యవధిలోనే పూర్తి చేశారు.
అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కుమ్రంభీం జిల్లాలో తెలంగాణ- మహారాష్ట్ర నేషనల్హైవే పెనుగంగా నది నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వీటి పనులను కూడా యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు.
Also Read: ఆగని వర్షాలు! నేడు కూడా కుండపోతే, ఈ జిల్లాలకు అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక