CM Revanth Visited Flood Effected Areas In Khammam: తెలంగాణలో భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు ఉద్ధృతితో పలు ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులకు సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఖమ్మం జిల్లాలో (Khammam District) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రూ.10 వేల చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సోమవారం రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న ఆయన.. బాధితులకు నిత్యావసరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి, అధికారులు ఉన్నారు.
'సర్టిఫికెట్లు కొత్తవి ఇస్తాం'
భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి బియ్యం, పప్పు, ఉప్పు నిత్యావసరాలు అందించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 'మంత్రులు, అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. మంత్రి పొంగులేటి నిద్ర లేకుండా వరద పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తూ సహాయక చర్యలకు ఆదేశిస్తున్నారు. 60, 70 ఏళ్లలో ఇంతటి భారీ వర్షాన్ని చూడలేదని కొందరు పెద్దలు చెబుతున్నారు. భారీ వర్షాలతో రాజీవ్ గృహకల్పలో నివసిస్తోన్న వందల కుటుంబాలు నష్టపోయాయి. వరద నీటిలో తమ పిల్లల సర్టిఫికెట్లు పోయాయని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి కొత్తవి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఇళ్లు నీట మునిగిన వారిని వెంటనే గుర్తించి రూ.10 వేలు అందించాలని ఆదేశించాం. ఎవరికైనా ప్రాణనష్టం జరిగితే రూ.5 లక్షలు, పశు సంపద నష్టం జరిగితే రూ.50 వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5 వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. వరదల్లో ఇల్లు దెబ్బతిన్న వారికి పీఎం ఆవాస్ యోజన కింద నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సాయం అందిస్తాం. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వచ్చి నష్టాన్ని అంచనా వేస్తారు. బాధితులు ఎవరూ అదైర్యపడొద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది.' అని సీఎం భరోసా కల్పించారు.
'రూ.5 వేల కోట్ల నష్టం'
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనకు ముందు ఆయన సూర్యాపేటలోని మోతె మండలం రాఘవపురంలో వరద పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వెంటనే రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరారు. జిల్లాలో ఆస్తి, పంట నష్టం వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 30 సెం.మీ అతి భారీ వర్షం పడిందని.. తక్షణ సాయం కోసం సూర్యాపేట కలెక్టర్‌కు రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
ప్రధానికి సీఎం లేఖ
మరోవైపు, తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని.. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరుతూ సీఎం రేవంత్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని.. తక్షణ సాయం అందించాలని కోరారు. అటు, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని.. విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నిర్దేశించారు.