Andhra Pradesh Rains | రెండు రోజుల ఎడతెరిపి లేకుండా కురిసి భారీ వర్షాలు, ఆపై వరద ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులు రైళ్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేకి భారీ నష్టాన్నే మిగిల్చాయి భారీ వరదలు. వరద ఎఫెక్ట్ పై దక్షిణ మద్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధధాల అధికారి (CPRO) శ్రీధర్ ను ఏబీపీ దేశం సంప్రదించింది. వరద నష్టం, రైళ్ల రాకపోకల పునరుద్ధరణపై ఆయన పంచుకున్న విశేషాలివే. 


ఏపీ, తెలంగాణాలో రైల్వే ట్రాక్స్ ఎక్కడెక్కడ ధ్వసంమయ్యాయి ?


సీపీఆర్వో: కాజీపేట్, విజయవాడ మధ్యలో రెండు చోట్ల రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కేసముద్రం, మహబూబాబాద్ మధ్యలో మట్టికొట్టుకుపోయి పట్టాలు గాల్లో వేలాడుతూ ఉండిపోయాయి. విజయవాడ సమీపంలో రాయనపాడులో ట్రాక్ పై భారీ స్దాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. స్టేషన్ లోకి వరదనీరు చేరింది. ట్రాక్ కు ఇరువైపులా వరద తీవ్రత కొనసాగుతోంది. ఇది మేజర్ ట్రంక్ రూట్, నార్త్  సౌత్ ను అనుసంధానం చేసే ప్రధాన మార్గం కావడంతో శనివారం సాయంత్రం నుంచి ఈ రోజు వరకూ 481 రైళ్లను రద్దు చేశాం. 13 రైళ్లను పాక్షికంగా  రద్దు చేశాం. 152 రైళ్లను దారిమళ్లించాము. ముఖ్యంగా దక్షిణ మద్య రైల్వే ఏపి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా మీదగా ఉండటం అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం ఉంది. కాజీపేట , విజయవాడ మధ్య ట్రాక్ దెబ్బతినడం, వరద ప్రభావం ఉంటంతో రైళ్ల రద్దుకు ప్రధాన కారణంగా మారింది. 


అనేక చోట్ల రైల్వే ట్రాక్ లు  గాల్లో వేలాడూ కనిపిస్తున్నాయి. అంతలా ప్రభావం చూపడానికి కారణాలేంటి...?


సీపీఆర్వో: డోర్నకల్ సమీపంలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. మహబూబాద్ లో ఒకేరోజు ఏడాదిలో పడాల్సిన వర్షపాతంలో నలభై శాతం వర్షం పడటంతో ట్రాక్ లు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. వరద ఉధృతి విపరీతంగా ఉంది. మిగతా చోట అంత ప్రభావం చూపలేదు. వర్షం , విపత్తులను ఎదుర్కొనేందుకు  రైల్వే పూర్తిగా సన్నద్దంగా ఉంది. 


ఏఏ మార్గాల్లో వెళ్లే రైళ్లను ఇప్పటివరకు రద్దు చేశారు.. దారిమళ్లింపు మార్గాలేంటి..?


సీపీఆర్వో: ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే వైపు, సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లే రైళ్లను, సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే  రైళ్లను రద్దు చేశాం. ఈ మార్గాల్లో కొన్ని పాక్షింగా రద్దు చేయడంతోపాటు అవసరమైన చోట కొన్ని రైళ్లను దారి మళ్లించాం. 


విజయవాడ వైపు వెళ్లే రైల్వేట్రాక్ పునరుద్దరణ ఎప్పుడు పూర్తవుతుంది. రాకపోకలు ఎప్పుడు మొదలవుతాయి?


సీపీఆర్వో: రైల్వే ట్రాక్ పై ఇంకా వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ప్రభావం తగ్గితే ఓ అంచనాకు వచ్చే అవకాశాలున్నాయి. ట్రాక్ కు ఏదైనా డ్యామేజ్ జరిగిందా, లేక వరద ప్రభావం తగ్గిన తరువాత రైళ్లు నడపవచ్చా అనేది ఓ అంచనాకు వస్తాం. కేసముద్రం విషయానికి  వస్తే రైల్వే జిఎం, ఉన్నతాధికారలు వెళ్లి స్వయంగా క్షేత్రస్దాయిలో పరిస్థితిని పరిశీలించారు. రేపు సాయంత్రం వరకూ రైళ్ల రాకపోకలు కొంత వరకూ మెరుగుపడే అవకాశాలున్నాయి. ఒకవేళ వరద ఉధృతి ఇంకా పెరిగి, వర్షాలు పడుతుంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 


 



వర్షాలు, వరదల ప్రభావంతో రైల్వే కు ఎంత నష్టం వచ్చింది...?


సీపీఆర్వో: రైల్వే ట్రాక్స్ దెబ్బతినడంతోపాటు రైళ్లు రద్దు చేయడం వల్ల భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. అది ఏస్దాయిలో ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేము. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా సాధ్యమైనంత వరకూ వారు గమ్యాన్ని చేరుకునేలా ఏర్పాట్లు చేశాము. ఓ ఐదు రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ముందుకు ,వెనక్కు తీసుకెళ్లలేని పరిస్థితి. వారికి ఉదయం నుంచి బ్రేక్ ఫాస్ట్, లంచ్ , టీ ఇలా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ఆర్టీసి బస్సులు ఏర్పాటు , జేసిబిల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా రక్షించాం. కేసముద్రంలో చిక్కుకున్న ఐదువేల మందిని గమ్యస్థానాలకు చేర్చాం.


రైళ్లు రద్దుతో ఇతర రాష్ట్రాల ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు ఏం సలహా ఇస్తారు?


సీపీఆర్వో: మరో రెండు రోజులు వర్షాల ప్రభావం ఉంది. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు రద్దు చేసుకోవడం మంచిది. వరదల తీవ్రత తగ్గేవరకూ ప్రభావిత ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తప్పవు. ఈ విషయాన్ని ప్రయాణికులు దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని మా సూచన.