Telangana News: తెలంగాణలో మరో పథకం అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా 12వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీన్ని ఈ నెల నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు.
డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా భూమి లేని నిరుపేదకు పన్నెండు వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ప్రకటించారు. ఏటా ఇచ్చే పన్నెండు వేల రూపాయలను రెండు విడతల్లో నిరుపేద ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. ఈ దఫా తొలి విడతగా ఆరు వేలు ఖాతాల్లో వేస్తామన్నారు.
రైతు భరోసా డబ్బులపై కూడా డిప్యూటీ సీఎం క్లారీటీ ఇచ్చారు. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు వేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఏ హామీ కూడా మర్చిపోలేదని అన్నారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలపై మరింత శ్రద్ధ పెట్టి పని చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రైతులకు వివిధ పథకాల ద్వారా 51 వేల కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు.
Also Read: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి
ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. ఇలాంటి ప్రభుత్వంపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ రైతులకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి చేసిన మంచి పని ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్నారు. అప్పులు పాలు చేసి ఇప్పుడు మాత్రం ఆర్థిక వ్యవస్థపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓవైపు ప్రజలసంక్షేమం చూసుకుంటూనే రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు మల్లు భట్టి విక్రమార్క. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని మరింతగా వృద్ధి చేసేందుకు వివిధ ప్రాంతాల్లో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Also Read: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం