Victim Family Get Compensation After 14 Years: ఓ కుటుంబం 14 ఏళ్ల పోరాటం అనంతరం వారికి రూ.1.99 కోట్ల పరిహారం అంది న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో (National Lok Adalat) ఓ కుటుంబానికి సంబంధించిన ఏళ్లుగా నలుగుతోన్న కేసు పరిష్కారమైంది. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ వ్యక్తి భార్య, కుమార్తెకు రూ.1.99 కోట్ల చెక్కును అందజేశారు. 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కిశోర్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందగా.. ఆయన భార్య శ్వేత, కుమార్తె సుదీక్షణ్ నందినీరెడ్డిలు రూ.2 కోట్ల పరిహారం కోసం మోటారు వాహనాల ప్రమాదాల కేసుల ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ కాలం విచారణ సాగింది. చివరకు ఈ ఏడాది జూన్‌లో రూ.1.08 కోట్ల పరిహారం మాత్రమే చెల్లించాలని.. లారీ యజమాని, బజాజ్ ఇన్సూరెన్స్ తదితరులకు ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.


లోక్ అదాలత్‌లో పరిష్కారం..


ఈ క్రమంలో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారించి కేసును పరిష్కరించింది. ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చి బాధితులకు రూ.1.99 కోట్ల చెక్కును పరిహారంగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని న్యాయమూర్తుల చేతుల మీదుగా అందజేసినట్లు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్దిని తెలిపారు. కమిటీ ఛైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి సూచనల మేరకు నిర్వహించిన లోక్ అదాలత్‌లో 225 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. ఇందులో మోటారు వాహనాల చట్టం కింద 169 కేసులతో పాటుగా కార్మికుల పరిహారం, సిటీ సివిల్ కోర్టు అప్పీళ్లు, కుటుంబ వివాదాలను పరిష్కరించి మొత్తం 1,100 మంది లబ్ధిదారులకు రూ.15.93 కోట్ల పరిహారాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు.


11.56 లక్షల కేసులు పరిష్కారం


రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 11.56 లక్షల కేసులు పరిష్కారమైనట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సభ్య కార్యదర్శి సీహెచ్.పంచాక్షరి తెలిపారు. ఇందులో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 2,702 సివిల్ కేసులు, 6.11 లక్షల క్రిమినల్ కేసులు ఉన్నాయని.. బాధితులకు పరిహారంగా రూ.161.05 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంలో భాగంగా 5.42 లక్షల ప్లీలిటిగేషన్ కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సుజయ్‌పాల్‌ల సూచనలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.


Also Read: Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!