SCR Special Trains To Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించగా.. మరిన్ని అదనపు రైళ్లను నడపనుంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 21, 28 తేదీల్లో విజయవాడ - కొల్లాం (రైలు నెం. 07177) ప్రత్యేక రైలు విజయవాడలో రాత్రి 10:15కి బయలుదేరి, రెండో రోజు ఉదయం 6:20కి కొల్లాం చేరుకుంటుంది. ఈ నెల 16, 23, 30 తేదీల్లో కొల్లాంలో రైలు (నెం. 07178) ఉదయం 10:45కి బయలుదేరి, రెండో రోజు రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది.
వచ్చే ఏడాది జనవరి 1, 8 తేదీల్లో కాకినాడ - కొల్లాం ప్రత్యేక రైలు (నెం. 07179) రాత్రి 11:50కి కాకినాడలో బయలుదేరి, రెండో రోజు ఉదయం 5:30 కు కొల్లాం చేరుకుంటుంది. జనవరి 15, 22 తేదీల్లో నర్సాపూర్ - కొల్లాం (నెం. 07183) ప్రత్యేక రైలు నర్సాపూర్‌లో రాత్రి 9 గంటలకు బయలుదేరి, రెండో రోజు ఉదయం 5:30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు జనవరి 17, 24 తేదీల్లో కొల్లాంలో ఉదయం 8:40 కు బయలుదేరి, రెండో రోజు సాయంత్రం 06:30 కు నర్సాపూర్ చేరుతుంది.
మరిన్ని సర్వీసుల వివరాలు
కాగా, ఇటీవలే మరిన్ని అదనపు సర్వీసులు సైతం దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1 వరకూ 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్ - కొట్టాయం, కొట్టాయం - సికింద్రాబాద్, మౌలాలి - కొట్టాయం, కాచిగూడ - కొట్టాయం, మౌలాలి - కొల్లం మధ్య జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ ఈ ప్రత్యేక సర్వీసులు సేవలందించనున్నాయి.
హైదరాబాద్ - కొట్టాయం - సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు (07065/07066) మొత్తంగా 8 సర్వీసులు మంగళ, బుధవారాల్లో అందుబాటులో ఉండనున్నాయి. మౌలాలి - కొట్టాయం - సికింద్రాబాద్ (07167/07168) శుక్ర, శనివారాల్లో, మాలాలి - కొల్లం - మాలాలి (07170/07172) ప్రత్యేక రైళ్లు శని, సోమవారాల్లో అందుబాటులో ఉండనున్నాయి. కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ (07169/07170) ప్రత్యేక రైళ్లు ఆది, సోమవారాల్లో నడపనున్నారు. ఈ రైళ్లల్లో ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు సైతం ఉంటాయని ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ దాదాపు 100కు పైగా అదనపు సర్వీసులను ద.మ రైల్వే శబరిమలకు అందుబాటులోకి తెచ్చింది. అటు, క్రిస్మస్, సంక్రాంతి దృష్ట్యా మరిన్ని సర్వీసులను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.
Also Read: Viral News: దెయ్యం దెబ్బకు అక్కడ మొత్తం ఇళ్లు ఖాళీ, రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఆ ఊరి పేరు