Warangal News Today: వరంగల్‌ జిల్లా గిర్మాజీపేట గ్రామానికి చెందిన రంజిత్ కుమార్, సైక్లింగ్ ద్వారా ప్రపంచ దేశాలను అన్వేషిస్తున్నాడు. భారతదేశాన్ని అతి తక్కువ ఖర్చుతో అన్వేషించాలని రంజిత్ తండ్రి కలగన్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి సమయంలో తన తండ్రిని కోల్పోయిన రంజిత్, ఆ కలను సాకారం చేసేందుకు సైక్లింగ్‌ను ఎంచుకున్నాడు. తండ్రి ఆశయాన్ని కొనసాగించడమే కాకుండా, ఆక్టివ్ మొబిలిటీ (Active Mobility) పట్ల అవగాహన పెంచడాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాడు.  



రంజిత్ మొదట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేశాడు. ఆ తర్వాత లడఖ్, ఇండియా చైనా బోర్డర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో పర్యటించాడు. ఈ ప్రయాణంలో వివిధ ప్రాంతాల సంస్కృతి, జీవన శైలులను అన్వేషించాడు. భారతదేశం గుండా సాగిన ఈ ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయస్థాయికి చేరుకుంది. సైక్లింగ్ ద్వారా రంజిత్ థాయ్‌లాండ్, మలేషియా, చైనా, సింగపూర్, నేపాల్,  కంబోడియా, తైవాన్, ఇండోనేషియా, సౌత్ కొరియా, మంగోలియా, ఇప్పుడు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో వివిధ ప్రాంతాల్లోని సైక్లింగ్ మార్గాలను అన్వేషిస్తూ, ఆక్టివ్ మొబిలిటీ ప్రాముఖ్యతను చాటుతున్నాడు. "సైక్లింగ్ అనేది ఆరోగ్యకరమైన జీవన శైలికి నాంది. ఇది మన శారీరక, మానసిక స్థితిని కూడా సమతుల్యంగా ఉంచుతుంది," అని ఆయన చెబుతున్నాడు. 




Also Read: ఇల్లు కూల్చినా EMI కట్ అవుతోంది - హైడ్రా బాధితుల కన్నీటి వెతలు


రంజిత్ తన యూట్యూబ్ ఛానల్ ‘రంజిత్ ఆన్ వీల్స్’ ద్వారా తన అనుభవాలను పంచుకుంటూ ఆక్టివ్ మొబిలిటీ గురించి అవగాహన కల్పిస్తున్నాడు. "ప్రతి ఊరు ఒక కథను చెబుతుంది, ప్రతి పరిచయం ఒక అనుభవాన్ని మిగులుస్తుంది," అని ఆయన అంటాడు. సైక్లింగ్ ద్వారా ఆయా దేశాల్లో కొత్త మనుషులతో పరిచయం కావడం, వారి ఆచారాలను గమనించడం, ఆహారాన్ని ఆస్వాదించడం ద్వారా మనిషికి జీవన గమనం పై కొత్త దృక్పథం కలుగుతుందని రంజిత్ విశ్వసిస్తున్నాడు. ఈ ప్రయాణంలో రంజిత్‌కు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాతావరణ మార్పులు, భాషా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, ఈ అనుభవాలే తనకు జీవిత పాఠాలు నేర్పిస్తున్నాయు అని చెబుతున్నాడు రంజిత్. 




"ప్రతి ఛాలెంజ్ నన్ను నేను మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తుంది. సైక్లింగ్ నాకు ఈ  అవకాశం కల్పించింది," అని ఆయన తెలిపారు. తండ్రి కలను సాకారం చేసే దిశగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రపంచయాత్రగా మారింది. మనుషుల మధ్య సంబంధాలు, సంస్కృతి, ఆహార సంప్రదాయాలు, జీవన శైలిలోని వైవిధ్యాన్ని అన్వేషించడమే కాకుండా, తన ప్రయాణం ద్వారా రంజిత్ ప్రపంచాన్ని ఒక కుటుంబంలా చూస్తున్నాడు. అటు అనిమల్ రైట్స్ గురించి కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు రంజిత్. 2022లో తన పెంపుడు కుక్క భగీరితో కలిసి, రంజిత్ భారత-చైనా సరిహద్దు వరకు సైక్లింగ్ చేసి, మూగజీవాల హక్కుల కోసం ప్రజల్లో అవగాహన కల్పించాడు.


ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న రంజిత్ Brisbaneలో జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా 3వ టెస్ట్ మ్యాచ్ కు హాజరయ్యాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రంజిత్, ఎమ్. ఫార్మసీ చదువు పూర్తి చేసి, తన యూట్యూబ్ ఛానెల్ ‘రంజిత్ ఆన్ వీల్స్’ ద్వారా సైక్లింగ్ అనుభవాలను పంచుకుంటూ, ఆక్టివ్ మొబిలిటీ పట్ల యువతలో చైతన్యం నింపుతున్నాడు. "మీ కలలు సాధారణమైనవిగా అనిపించవచ్చు, కానీ వాటిని నెరవేర్చే మీ ప్రయాణమే అసలైన విజయం" అని రంజిత్ తెలిపాడు.


Also Read: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం