ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ వి.పొట్లూరి (పీవీపీ)పై హైదరాబాద్‌లో కేసు నమోదు అయింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పీవీపీపై కేసు పెట్టారు. తన ఇంటి గోడను పీవీపీ అనుచరులు బలవంతంగా కూలగొట్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. పీవీపీ అనుచరులు తమపై వేధింపులకు పాల్పడుతున్నారని డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ - 7లో ఓ విల్లాను డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి కొనుగోలు చేశారు. ఆ ఇంటికి మరమ్మతులు చేయించడంలో భాగంగా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. అయితే శ్రుతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ప్రహరి గోడతో పాటు రేకులను కూడా పీవీపీ అనుచరుడు బాలాజీ, ఇంకొంత మంది ఆయన అనుచరులు జేసీబీతో కూల్చేయించారని శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేంటని నిలదీసినందుకు శ్రుతి రెడ్డిపై వారు బెదిరింపులకు పాల్పడినట్లుగా చెప్పారు. దీంతో పీవీపీతో పాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ, అతనికి సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేసినట్లుగా బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.
ఆ ఫిర్యాదు ఆధారంగా పీవీపీ, ఆయన అనుచరులపై ఐపీసీ 447,427,506,509 r/w34 కింద కేసు నమోదు చేసినట్లుగా బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ చేస్తున్నట్లుగా చెప్పారు.
అయితే, గతంలో పీవీపీ తన రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ప్రేమ్ పర్వత్ విల్లాస్ అనే వెంచర్ డెవలప్ చేసి విక్రయించారు. ఈ విల్లాలు కొనుక్కున్నవారు తమకు అనుకూలంగా ఇల్లు ఉండేందుకు మార్పులు చేర్పులు చేసుకోవడంతో ఆయన అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఓ రినోవేషన్ చేసుకుంటున్న ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటిని కూలగొట్టినట్టు కేసు నమోదై ఉంది. అప్పట్లో ఆ కేసు విచారణకు వెళ్లిన పోలీసులపైకి ఆయన కుక్కల్ని వదిలారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. తాజాగా అలాంటిదే మరో కేసు నమోదు కావడం చర్చనీయంశంగా మారింది.
Also Read: E-Cell IIT Hyderabad: వ్యాపారవేత్తగా ఎదగాలని ఉందా? 'ఐఐటీ హైదరాబాద్' నిర్వహించే ఈ సదస్సు మీకోసమే!!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!