Budget 2022 Telugu, Union Budget 2022: ఏటా బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు అన్ని రంగాల వారు ఆశల చిట్టా బయట పెడుతూనే ఉంటారు. ఇక్కడ మాకు పన్ను తగ్గించండి, అక్కడ మాకు కాస్త ఉపశమనం కల్పించండి అంటూ ఆర్థిక మంత్రికి వినతి చేస్తుంటారు. కరోనా వైరస్‌ మహమ్మారి వచ్చాక స్థిరాస్తి రంగం భారీ కుదుపునకు లోనైంది. నగదు ప్రవాహం తగ్గడం, డబ్బులు లేకపోవడం, ఉద్యోగాలు కోల్పోవడంతో ఇళ్ల గిరాకీ తగ్గిపోయింది. గతేడాది నుంచే కాస్త కోలుకోవడం మొదలైంది.


ఇంటి విక్రయాలు పుంజుకొనేందుకు చర్యలు తీసుకోవాలని స్థిరాస్తి రంగ వ్యాపారులు అంటున్నారు. ఇంటి రుణాల్లో అసలు, వడ్డీపై రాయితీలు పెంచాలని కోరుకుంటున్నారు. అద్దె ఇళ్లపై వచ్చే ఆదాయంపై మినహాయింపులు పెంచాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ముడి వనరులు, సామగ్రిపై జీఎస్‌టీ భారం తగ్గించడంతో పాటు కొత్త ఇళ్లకు గిరాకీ పెరిగేందుకు రెంటల్‌ ఆదాయంపై పన్ను తొలగించాలని కోరుతున్నారు.


Also Read: Budget 2022: దయ చూపాలమ్మా 'నిర్మలమ్మ'! బడ్జెట్‌కు ముందు వేతన జీవుల వేడుకోలు!!


Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్‌ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్‌ కంపెనీకి నష్టాల సెగ!!


Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!


'కొవిడ్‌ రెండో వేవ్‌ తర్వాత ఇళ్ల గిరాకీ పెరిగింది. గృహ రుణాల వడ్డీరేట్లు తగ్గడమే ఇందుకు కారణం. ఆగిపోయిన ప్రాజెక్టులు, అమ్ముడవ్వని ఇళ్ల వల్ల ఇంకా ఈ రంగం స్తబ్దుగానే ఉంది. ప్రస్తుతం మూడో వేవ్‌ ఇళ్ల అమ్మకాలకు సవాళ్లు విసురుతోంది' అని హౌజింగ్‌.కామ్‌, మకాన్‌.కామ్‌, ప్రాప్‌టైగర్‌.కామ్‌ గ్రూప్‌ సీఈవో ధ్రువ్‌ అగర్వాల్‌ అన్నారు. ప్రస్తుతం రూ.25,000 కోట్లుగా ఉన్న SWAMIH నిధిని రూ.లక్ష కోట్లకు పెంచాలని ఆయన కోరుతున్నారు. ఎన్‌పీఏ, ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 2019, నవంబర్‌లో  కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది.


'అందరికీ సొంత ఇంటి కలను నిజం చేసుకొనేందుకు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ పథకానికి మరిన్ని నిధులు కేటాయిస్తే దిగువ, మధ్య తరగతి వర్గాలు ఇళ్లను కొనుగోలు చేసుకొనేందుకు వీలవుతుంది. పీఎంఏవైపై పెండింగ్‌ ఖర్చు లక్ష కోట్లను మించగా FY2022కు రూ.48,000 కోట్లు ( బడ్జెట్‌ అంచనా), FY2022కి రూ.41,000 కోట్లు (సవరించిన అంచనా)గా ఉంది' అని ఇక్రా తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన లక్ష్యమైన 5 కోట్ల ఇళ్లను కేటాయించాలంటే బడ్జెట్‌ పెంచాలని కోరింది.


స్థిరాస్తి రంగానికి ఇండస్ట్రీ స్టేటస్‌ ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణానికే ఇలాంటి హోదా ఉంది. తక్కువ ఖర్చుతో నిధులు సమీకరించేందుకు హోదా ఇవ్వక తప్పదని సుదీర్ఘ కాలంగా రియల్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక ఏడాది పాటు పన్ను చెల్లింపుదారుల రూ.10 లక్షల ఆదాయం వరకు టాక్స్‌ హాలిడే ఇస్తే ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతుందని అంటున్నారు. స్థిరాస్తి రంగంలోని స్టార్టప్‌లపై జీఎస్‌టీ భారం తగ్గించాలని కోరుతున్నారు. ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వేస్తున్నారు.