Tirumala Updates: నింబధనలను అమలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు నిషిద్దం ఉన్నప్పటికీ రాజకీయ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల.. ఏడు కొండలపై స్వయంభువుగా వెలసిన శ్రీవెంకటేశ్వరుడి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. కోనేటి రాయుడు దర్శనార్థం వచ్చే భక్తులతో తిరుమల నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బ తినకుండా దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తిరుమలలో కొన్ని నిబంధనలను అమల్లోకి తెచ్చారు.. 


తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు, ప్రచారాలు చేయడాన్ని ఎన్టీఆర్ హయాంలో నిషేధించారు. అప్పటి సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఈ నిర్ణయాన్ని అమలుచేస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో ఉండే తిరుమలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో కూడా రాజకీయ కరపత్రాలు, జెండాలు, కండువాలు లేకుండానే నిశ్శబ్దంగా ఇంటింటి ప్రచారం చేసుకునేలా నిబంధనలు అమల్లోకి తెచ్చారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ వెలుపల రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయకుండా స్వామి వారి వైభవాన్ని, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై సూచించేవారు.


స్వామి వారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు, రాజకీయ నాయకులలో మెజారిటీ శాతం వారు తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకుండా స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వారికి కలిగిన అనుభూతిని టీటీడీ భక్తులకు చేస్తున్న ఏర్పాట్లపై మాట్లాడి వెళ్లిపోతారు. ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించే వారిలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. శ్రీనివాసుడు తన కుల దైవం కావడంతో శ్రీవారి దర్శనార్థం పలుమార్లు వచ్చినా రాజకీయ ప్రసంగాలు చేయలేదు. ఆపై మాజీ సీఎంలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, దివంగత రోశయ్య కూడా ఇదే నిబంధనలను అనుసరించారు. 
Also Read: Makar Sankranti 2022: ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు … మరి దక్షిణాయణం ఏంటి…!


సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలుమార్లు తిరుమల పర్యటనకు వచ్చారు. ఎటువంటి ప్రసంగాలు చేయకుండా తిరుమల పర్యటనను ముగించుకునేవారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రులు ఒకరిద్దరు మినహా అంతా ప్రభుత్వ పథకాలపై మాట్లాడేవారు. తెలంగాణ నుంచి తిరుమల వచ్చే అమాత్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రభుత్వ పథకాలపై మాట్లాడేవారు.


ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా..
ఎక్కడైనా తగ్గేదే లే అంటూ వైఎస్సార్‌సీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు తిరుమలలోనే అధికంగా చేస్తుంటారు. తిరుమలకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, ప్రతిపక్ష నాయకులపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు చేశారు. టీటీడీ పలుమార్లు రాజకీయ విమర్శలు చేయొద్దని రోజాకు విజ్ఞప్తి చేసినా ఆమె తీరులో మారలేదు. దీంతో శ్రీవారి ఆలయం వద్ద ప్రముఖులు వచ్చిన సమయంలో ఏర్పాటు చేసిన పోడియంను ఆలయం వద్ద నుంచి తొలగించింది టీటీడీ.


దర్శనార్థం వచ్చే ప్రముఖులు ఆలయం వద్ద రాజకీయ విమర్శలు చేయకుండా చూడాలని టీటీడీ ఉన్నతాధికారులు విజిలెన్స్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన విజిలెన్స్ రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఉండాలని వారిని అభ్యర్థించే వారు. దీంతో రోజా తన పంతం మరోలా నెగ్గించుకునే ప్రయత్నం చేశారు. ఆలయం వద్ద రాజకీయ ప్రసంగాలు మాట్లాడే దానికి టీటీడీ అంగీకరించక పోవడంతో జిఎంసి టోల్గేట్ దాటిన అనంతరం రోడ్డుపై మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు కురిపించే వారు. మిగతా ప్రముఖుల మాత్రం టీటీడీ సూచనలు గౌరవిస్తూ తిరుమలలో రాజకీయ ప్రసంగాలకి దూరంగా ఉండేవారు.


రోజా మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఆమె తీరులో మార్పు రాలేదు. తిరుమలకు వచ్చిన ప్రతిసారి ఓవైపు సీఎం జగన్ ను పొగుడుతూనే మరోవైపు ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు చేస్తున్నారు. తిరుమలలో రోజా విమర్శలు చేయడాన్ని కొందరు భక్తులు వ్యతిరేకిస్తున్నారు. నెలకు నాలుగైదు సార్లు స్వామి వారి సేవలో రోజా పాల్గొంటున్నారు. మరికొందరు నాయకులైతే పనిగట్టుకొని మరీ కొండకు వచ్చి స్వామి వారి దర్శనానంతరం రాజకీయ విమర్శలు చేసి నిత్యం వార్తల్లో కనిపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని విమర్శలున్నాయి. ఏ చిన్న ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే కొండకు వచ్చి వాటిపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిపోయింది. 


బీజేపీ ఏపీ అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి సైతం తరచు తిరుమలకు వస్తుంటారు. తిరుమలకు వచ్చే కేంద్ర మంత్రులు స్వామీజీలకు మాత్రం తిరుమాలలో నో పాలిటిక్స్ అంటూ చెబుతారు. తీరా ఆయనే ఆలయం ముందు వచ్చి టీటీడీపై, ప్రభుత్వంపై రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. వివాదం హైలైట్ అవ్వాలంటే మాట్లాడితేనే సాధ్యమనే ఫార్ములా గ్రహించారేమో గాని.... ఎలాంటి సమస్య వచ్చిన తిరుమలలో మీడియా ముఖంగా విమర్శలు చేస్తున్నారు.


ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తరచూ శ్రీవారి సేవలో పాల్గొంటారు. తిరుమలకు వచ్చిన ప్రతిసారి రాజకీయ వ్యాఖ్యలు, వివాదాస్పద కామెంట్స్‌కు కేంద్ర బిందువుగా మారుతారు. అదే క్రమంలో సొంత పార్టీ నేతలను పొగిడే క్రమంలో వారిపైనే తిట్ల దండకం ఠక్కున ఎత్తుకుంటూ నాలుక్కరుచునే పరిస్థితులు చూశాం. చంద్రబాబుపై చేయాల్సిన విమర్శలు సీఎం జగన్‌పై చేసి అభాసుపాలు అయిన సందర్భాలు ఉన్నాయి. తనేం మాట్లాడతారో తెలియకుండా మాట్లాడేసి వెళ్లిపోతుంటారు.


మరికొందరైతే నిత్యం అధికార పార్టీ నాయకులను పొగడ్తలతో ముంచెత్తి కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వారిపై టీటీడీ కఠినంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరమ పవిత్రంగా భావించే తిరుమల కొండపై రాజకీయ నాయకులు విమర్శలు చేసుకోవడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా టీటీడీతోపాటు ప్రభుత్వం స్పందించి రాజకీయ నాయకులు తిరుమల రాజకీయ విమర్శలకు వేదికగా మార్చకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.


Also Read: Gold Silver Price Today: మళ్లీ భగ్గుమన్న బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే..


Also Read: Hyderabad: దేశంలోనే హైదరాబాద్ టాప్‌.. పదేళ్లలో ఎంత మార్పో..! కేంద్రం తాజా నివేదికలో స్పష్టం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి