కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులపై వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై.. సీజే జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు విధుల్లో చేరారని.., అదనపు ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం..  జీవో 317పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఉపాధ్యాయుల కేటాయింపులు అనేవి.. తుది తీర్పునకు లోబడి ఉండాలని కోర్టు చెప్పింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4కి వాయిదా వేసింది.


 అసలు జీవో నెం.317 ఎందుకంటే ?



తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల ఉద్యోగులను 32 కొత్త జిల్లాలకు కేటాయింపులు చేయాల్సి ఉంది.  ఇలా చేయడానికి ప్రభుత్వం జీవో 317ను విడుదల చేసింది.  స్థానికేతర కోటాలో చేరినవారైనప్పటికీ.. ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్‌ ప్రకారం ఉద్యోగులకు జిల్లాను కేటాయించాల్సి ఉంది. సాధారణంగా బదిలీ అయితే కొన్నేళ్లకు మళ్లీ కోరుకున్న ప్రాంతానికి రావొచ్చు. కానీ, కొత్త జిల్లాల వారీగా కేటాయింపులు శాశ్వతం. అంటే సర్వీస్​అంతా ఉద్యోగులకు కేటాయించిన జిల్లాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత జిల్లాను వదిలి వెళ్లాల్సి వస్తోందనే బాధతో స్థానికత ఆధారంగానే జిల్లాలకు కేటాయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జీవోను వ్యతిరేకిస్తున్నాయి. 





 

స్థానికతను కాకుండా సీనియారిటీని బట్టి బదిలీలు !


కొత్త జిల్లాల స్థానికతను పక్కనబెట్టి సీనియారిటీకే ప్రాధాన్యం ఇస్తూ ఉపాధ్యాయుల బదిలీలను చేయడం వివాదాస్పదం అవుతోంది. తెలంగాణలో మొత్తం వర్కింగ్​టీచర్లు ఒక లక్ష తొమ్మిది వేల మంది ఉన్నారు. కాగా ఇందులో దాదాపు 22 వేల మందికి ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీలు జరిగాయి. ఎన్నో ఏండ్లుగా స్థానికంగా ఉన్నవారిని వందల కిలోమీటర్ల దూరం పంపడంతో మహిళా టీచర్లకు ఇబ్బందిగా మారింది. దీనివల్ల కుటుంబాన్ని, పిల్లలను వదిలి వెళ్లాల్సిరావడం, వృద్ధులైన కన్న తల్లిదండ్రులు, అత్తా మామలకూ దూరంగా వెళ్లాల్సి ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.


ఉద్యోగసంఘాలు, రాజకీయ పార్టీల డిమాండ్లేమిటి?


ప్రస్తుతం ఈ సమస్య రాజకీయం అయింది.  బదిలీల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసి.. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి... స్థానికత ప్రాతిపదకన బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  వీరికి రాజకీయ పార్టీలు మ్దదతు పలుకుతున్నాయి. పదోన్నతలు కల్పించిన అనంతరం ఏర్పడిన ఖాళీల్లో నష్టపోయిన ఉపాధ్యాయులను భర్తీ చేసి న్యాయం చేయాలని..   బ్లాక్​చేసిన 13 జిల్లాల వారికి కూడా అవకాశం కల్పించాలని.. . జిల్లా స్థాయిలో జరిగిన తప్పులపై ఆయా జిల్లాల కలెక్టర్లు సరిచూసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.  






Also Read: Covid Updates: తెలంగాణలో కొత్తగా 2,983 కేసులు, ఇద్దరు మృతి... లక్షకు పైగా నిర్థారణ పరీక్షలు


Also Read: Minister Harish Rao: రాబోయే 3 వారాలు చాలా కీలకం.. ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు వృథా చేసుకోవద్దు