తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,07,904 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2983 మందికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 7,14,639కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,062కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 22,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 2,706 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,88,105కి చేరింది. 


Also Read: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకి కరోనా... స్వల్ప లక్షణాలతో ఆసుపత్రి చేరినట్లు డీహెచ్ ప్రకటన


వచ్చే మూడు వారాలు కీలకం


కరోనా.. ఎంతమందికి వచ్చినా.. మందులు ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. 2 కోట్ల కొవిడ్‌ టెస్టింగ్ ఎక్విప్‌మెంట్‌ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కోటి మందికి సరిపడా హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి, వ్యాధి లక్షణాలుంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకుని ఇచ్చిన మందులను వారం రోజుల పాటు వాడితే తగ్గిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.


Also Read: పోలీస్ శాఖపై కరోనా పంజా... హైదరాబాద్ పరిధిలోని పలు పీఎస్ లలో భారీగా కేసులు...


ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని హరీశ్ రావు హితవు పలికారు. ప్రజాప్రతినిధులు, అధికారులు 100శాతం వ్యాక్సిన్‌ అందించే విధంగా కృషి చేయాలన్నారు. వారం రోజుల్లో నారాయణపేటకు డయాలసిస్‌ కేంద్రం మంజూరు చేస్తామని తెలిపారు. నారాయణపేటలో రూ.66 కోట్లతో  300 పడకల ఆసుపత్రి నిర్మించబోతున్నట్టు.. ఫిబ్రవరిలో శంకుస్థాపన ఉంటుందని వెల్లడించారు. మరోవైపు... వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంపై మంత్రి హరీశ్ రావు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. వ్యాక్సిన్ రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు కుదించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. అలాగే వైద్య ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించాలని హరీశ్ రావు కేంద్ర మంత్రిని కోరారు. అలాగే, 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్‌తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలని సూచించారు. 


Also Read: ఆసుపత్రులే అతని టార్గెట్‌.. డాక్టర్‌ అవతారమెత్తి చోరీలు, పేషెంట్ల కార్లు క్షణాల్లో మాయం!