తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. తనకు స్వల్ప కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. నిర్థారణ పరీక్షలో కోవిడ్‌ పాజిటివ్ కావడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌ అయ్యానని, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నానని స్పష్టం చేశారు. తాను త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానన్నారు. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాసరావు కోరారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కోవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. 


Also Read:  ఏపీలో కరోనా కల్లోలం.... కొత్తగా 6996 కోవిడ్ కేసులు, 4గురు మృతి


పోలీసులపై ప్రభావం


తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పోలీస్ శాఖపై కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా హైదరాబాద్ సీసీఎస్‌, సైబర్ క్రైమ్‌ విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇటీవల ఓ కేసు విషయంలో రాజస్థాన్‌ వెళ్లి వచ్చిన ఎస్సైకి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతని నుంచి మిగతా సిబ్బందికి సోకినట్లు తెలుస్తోంది. పాజిటివ్ వచ్చిన 20 మంది పోలీసులు హోం ఐసోలేషన్‌ ఉంటూ చికిత్స పొందుతున్నారు. యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో ఏసీపీ, సీఐ సహా 12 మందికి కరోనా సోకింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డీఐ, ఎస్ఐ, 4 గురు కానిస్టేబుల్ లకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది.  మాస్క్ లేకుండా స్టేషన్ లోకి ఎవ్వరిని అనుమతించని పోలీసులు చెబుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్సై, 5గురు కానిస్టేబుల్ లకు కరోనా సోకింది. మీర్పేట్ పీస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై, ఏఎస్సై, 9 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. చైతన్యపురి పీఎస్ లో 8 మంది  కానిస్టేబుల్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 


Also Read: పోలీస్ శాఖపై కరోనా పంజా... హైదరాబాద్ పరిధిలోని పలు పీఎస్ లలో భారీగా కేసులు...


వైద్య సిబ్బందిపై పంజా


వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో దాదాపు 80 మంది వైద్య సిబ్బంది కోవిడ్‌ బారిన పడ్డారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అంటున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో కూడా దాదాపు 180 మంది వైద్యులు, సిబ్బంది కోవిడ్‌ బారిన పడ్డారు. నీలోఫర్‌ ఆసుపత్రిలో 25 మంది వైద్య సిబ్బందికి కోవిడ్‌ సోకింది. పెరుగుతున్న కరోనా కేసులకు తోడు వైద్య సిబ్బందికి వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. 


Also Read: కేంద్ర మంత్రికి లేఖ రాసిన హరీశ్ రావు.. వ్యాక్సిన్ గడువు తగ్గించాలని విజ్ఞప్తి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి