నారాయణపేట జిల్లా కోయిల్‌కొండలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని మంత్రి హరీశ్ రావు ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మాస్క్ తప్పకుండా ధరించాలని కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయని హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. ఏఎన్‌ఎం సబ్‌సెంటర్‌, పీహెచ్‌సీ, ప్రభుత్వ దవాఖానాకు ఎక్కడికి వెళ్లినా కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు కిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. 


కరోనా.. ఎంతమందికి వచ్చినా.. మందులు ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. 2 కోట్ల కొవిడ్‌ టెస్టింగ్ ఎక్విప్‌మెంట్‌ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కోటి మందికి సరిపడా హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి, వ్యాధి లక్షణాలుంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకుని ఇచ్చిన మందులను వారం రోజుల పాటు వాడితే తగ్గిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.


ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని హరీశ్ రావు హితవు పలికారు. ప్రజాప్రతినిధులు, అధికారులు 100శాతం వ్యాక్సిన్‌ అందించే విధంగా కృషి చేయాలన్నారు. వారం రోజుల్లో నారాయణపేటకు డయాలసిస్‌ కేంద్రం మంజూరు చేస్తామని తెలిపారు. నారాయణపేటలో రూ.66 కోట్లతో  300 పడకల ఆసుపత్రి నిర్మించబోతున్నట్టు.. ఫిబ్రవరిలో శంకుస్థాపన ఉంటుందని వెల్లడించారు.


మరోవైపు... వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంపై మంత్రి హరీశ్ రావు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. వ్యాక్సిన్ రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు కుదించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. అలాగే వైద్య ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించాలని హరీశ్ రావు కేంద్ర మంత్రిని కోరారు. అలాగే, 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్‌తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలని సూచించారు. 


18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హరీశ్ రావు కోరారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోసు విధానాలు, వాటి ద్వారా వస్తున్న ఫలితాల ఆధారంగా తాను ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా హరీశ్ రావు లేఖలో వివరించారు.


Also Read: TS Corona Updates: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకి కరోనా... స్వల్ప లక్షణాలతో ఆసుపత్రి చేరినట్లు డీహెచ్ ప్రకటన


Also Read: Corona Updates: పోలీస్ శాఖపై కరోనా పంజా... హైదరాబాద్ పరిధిలోని పలు పీఎస్ లలో భారీగా కేసులు...


Also Read: Khammam Crime: ఆసుపత్రులే అతని టార్గెట్‌.. డాక్టర్‌ అవతారమెత్తి చోరీలు, పేషెంట్ల కార్లు క్షణాల్లో మాయం!