Food Poisoning Cases In Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో హాస్టల్స్‌లో, మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం సంచలనంగా మారుతోంది. ఇది అహార కలుషితం కాదు రాజకీయ కలుషితమని తీవ్ర ఆరోపణలు చేస్తోంది ప్రభుత్వం. కుట్రపూరితంగానే బీఆర్‌ఎస్ నేతలు ఇదంతా చేస్తున్నారని మంత్రి సీతక్క అనుమానం వ్యక్తం చేశారు. 


వరుస ఘటనలతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి


ఈ మధ్య కాలంలో ఏదో ప్రాంతంలో మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు, హాస్టల్‌లో ఫుడ్ తీసుకున్న విద్యార్థులు ఆసుపత్రిపాలు అవుతున్నారు. పదుల సంఖ్యలో ఇలా అస్వస్థతకు గురి కావడం ప్రభుత్వాన్ని చికాకు పెడుతోంది. వసతులు లేవంటూ ప్రతిపక్షం రోడ్లపైకి రావడంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. 


సీరియస్‌నెస్‌ లేదని హైకోర్టు సీరియస్‌ 


ఇలా ఫుడ్ పాయిజినింగ్ కావడంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. సంబంధిత అధికారులు, ప్రభుత్వం ఏం చేస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిలదీశారు. అయితే మాగనూర్ ఘటనకు స్కూల్‌లో పెట్టిన ఫుడ్ కారణం కాదని విద్యార్థుల్లో కొందరు బయట ఫుడ్ తీసుకున్నారని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 


విద్యార్థుల అన్నంపై కుట్ర: సీతక్క


ఫుడ్ పాయిజన్ వెనుక భారీ కుట్ర ఉందని మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్రలో అధికారులు భాగమై ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఉద్యోగాల నుంచి వారిని తప్పిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీనంతటికీ బీఆర్‌ఎస్ కారణమని ఆమె ఆరోపణలు చేశారు. జరుగుతున్నద్ది ఆహార కలుషితం కాదని రాజకీయ కలుషితమన్నారు. అన్ని కోణాల్లో ఇప్పటికే కీలకమైన సమాచారం తెప్పించుకున్నామని త్వరలోనే వివరాలు బయటపెడతామన్నారు.


కేటీఆర్‌ టీం పని ఇదే : సీతక్క


చాలా సున్నితమైన అంశాలపై కుట్ర చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు సీతక్క. ఫుడ్‌ పాయిజన్, లగచర్ల కేసు, దిలావర్‌పూర్‌లో ఆందోళనలు అన్నీ బీఆర్‌ఎస్‌ ప్రోత్బలంతోనే జరుగుతున్నాయన్నారు. అసలు ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. ఇందులో మంత్రి తలసాని కుటుంబానికి భాగం ఉందని ఆరోపించారు. విధ్వంసం సృష్టించి తర్వాత శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని కేటీఆర్‌ టీం పనిగా పెట్టుకుందన్నారు. 


కన్నబిడ్డల్లా చూసుకోవాలన్ని సీఎం


ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వ‌స‌తిగృహాలు, గురుకుల పాఠ‌శాలల్లో విద్యార్థుల‌ను క‌న్న బిడ్డల్లా చూడాల‌ని సూచించారు. ప‌రిశుభ్రమైన వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అందించ‌డంలో నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా కలెక్టర్లకు సూచించారు. 


తనిఖీలకు ఆదేశం


విద్యార్థుల‌కు అందించే ఆహారంపై వస్తున్న విమర్శలు జరుగుతున్న ఘటనలు పునరావృతం కాకూడదన్నారు సీఎం. క‌లెక్టర్లు త‌ర‌చూ పాఠశాలల‌, వ‌స‌తిగృహాలు, గురుకుల పాఠ‌శాల‌ల‌ు త‌నిఖీ చేయాల‌న్నారు. అలా తనిఖీ చేసిన తర్వాత నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం కావద్దని చాలా సార్లు చెప్పినప్పటికీ పదే పదే జరుగుతుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. 


Also Read: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి


నిర్లక్ష్యానికి వేటు తప్పదు


విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఉదాశీనంగా ఉంటే అధికారులు, సిబ్బందిపై వేటు తప్పదని రేవంత్ హెచ్చరించారు. నిర్లక్ష్యంగా ఉన్న వారి ఉద్యోగాలను కూడా తొలగించేందుకు ఆలోచించబోమన్నారు. విద్యార్థుల‌కు మంచి విద్య, భోజనం అందించడానికి వేల సంఖ్యలో ఉద్యోగాలు నియమించామన్నారు. డైట్ ఛార్జీలు పెంచిన విష‌యాన్ని గుర్తు చేశారు.


కఠిన చర్యలు తీసుకోండి


విద్యార్థులకు మంచి విద్య అందివ్వాలనే ఉద్దేశంతో సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నా... కొందరు అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి శ‌క్తుల విష‌యంలో క‌ఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తామ‌ని  సీఎం హెచ్చరించారు. వ‌స‌తి గృహాల్లో ఆహారం విష‌యంలో కొంద‌రు ఉద్దేశపూరంగానే పుకార్లు సృష్టించి వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. వారిపైనా క‌ఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.


Also Read: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ