తెలంగాణలో సంచలనంగా మారిన నారాయణపేట జిల్లా మాగనూర్‌లో వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజినింగ్ అవ్వడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా ప్రశ్నించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయ్యింది. 


ఫుడ్‌ కంటామినేట్ అవ్వడం చాలా సీరియస్ అంశమన్న సీజే... పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్న హైకోర్టు... ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆక్షేపించారు. 


Also Read: తెలంగాణలో మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్, 21 మంది విద్యార్థులకు అస్వస్థత


మాగనూర్‌ ఫుడ్ పాయిజినింగ్‌ ఇష్యూపై వారంలో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకు అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అంటు అసహనం వ్యక్తం చేసింది. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారని మండిపడింది. అధికారులకు కూడా పిల్లలున్నారని... మానవతా దృక్వథతంతో వ్యవహరించాలని చీవాట్లు పెట్టింది. 


భోజన విరామం తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తామని ఏఏజీ చెప్పడంతో విచారణ వాయిదా వాయిదా పడింది. ఈ కేసులో పిటిషనర్‌ తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం తిన్న విద్యార్థులు ఇలా ఆసుపత్రిపాలవుతున్నారని కోర్టుకు వివరించారు. 


Also Read: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు