Dilawarpur Ethanol Factory Row : నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది. దిలావర్‌పూర్–గుండంపల్లి మధ్య నిర్మాణ దశలో పీఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ప్రజలు రోడ్డు ఎక్కారు. తమకు అన్నం పెట్టే పొలాలను వదుకునేందుకు సిద్దంగా లేమని ఫ్యాక్టరీ వల్ల పంట భూములు నాశనం అవుతాయని ఆందోళన బాటపట్టారు. దీంతో ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో వారంతా శాంతించారు. కానీ రాజకీయ కాక మాత్రం చల్లారడం లేదు.
గత ప్రభుత్వం పాపమే
అసలు ఈ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చిందే బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలని రేవంత్ సర్కారు, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. అయినా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే పని చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ విషయంలో ప్రశ్నించాలంటే ముందుగా కేసీఆర్, బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించాలని నిలదీయాలని అన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీలో తలసాని కుటుంబానికి భాగం
అంతే కాకుండా ఇంకో బాంబు కూడా పేల్చారు కాంగ్రెస్ నేతలు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానిదనంటూ ఆరోపించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు నీళ్లు, కరెంట్‌తోపాటు ఇతర సౌకర్యాలకు అనుమతులు ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఇక్కడ కంపెనీ కడుతున్న పీఎంకే డిస్టిలేషన్‌లో తలసాని కుటుంబం ఉందని పేర్కొన్నారు. ఈ కంపెనీ డైరెక్టర్‌లుగా ఆయన కుమారుడు తలసాని సాయి కిరణ్, ఆయన అల్లుడు ఉన్నారని ఆరోపించారు.
అధికారంలో ఉన్నప్పుడు గుట్టుచప్పుడు కాకుండా అనుమతులు ఇచ్చి ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఆందోళన చేస్తున్న ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన అధికారులను అడ్డుకోవడం వారిపై దాడికి యత్నించడం ఎంత వరకు కరెక్ట్ అని మంత్రులు ప్రశ్నిస్తున్నారు.
ఖండించిన మాజి మంత్రి
కాంగ్రెస్ నేతల ఆరోపణలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. తమ ఫ్యామిలీకి ఇథనాల్ ఫ్యాక్టరీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
అసలేం జరిగిందంటే
ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ దిలావర్‌పూర్, గుండంపల్లి, సముందర్‌పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం గ్రామాల ప్రజలు ఆందోళన తీవ్ర తరం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపేయాలన్న డిమాండ్‌తో చాలా కాలంగా వారు నిరసన కొనసాగిస్తున్నారు. దీన్ని గుర్తించిన అధికారులు వారితో మాట్లాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అధికారులను అడ్డుకున్న నిరసనకారులు వారిని నిర్బంధించారు. ఇదే అక్కడ ఉద్రిక్తతకు దారి తీసింది.
అధికారులను నిర్బంధించడాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్టుకు నిరసనగా ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. తమకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని తమ వారిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో కుటుంబ సమేతంగా జాతీయ రహదారి 61పై బైఠాయించారు. అక్కడే పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆందోళనబాటపట్టారు.
ఇది మరింత తీవ్రతరం అవుతుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఫ్యాక్టరీ పనులు నిలిపేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందుకున్ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిరసనలను ప్రభుత్వం గుర్తించిందని అందుకే పనులు నిలిపేస్తున్నట్టు తెలిపిందని వారికి వివరించారు. ప్రభుత్వం నిర్ణయం తెలుసుకున్న ప్రజలు పోరాటానికి తాత్కాలికంగా విరామం ఇచ్చారు. అరెస్టు చేసిన తమ వారిని విడిచి పెట్టాలన్న నిరసనకారుల విజ్ఞప్తి మేరకు వాళ్లను కూడా విడిచిపెట్టారు.
ఫ్యాక్టరీ పనులు నిలిపేస్తున్నామన్న ప్రకటనతో దిలావర్‌పూర్‌లో సంబరాలు మిన్నంటాయి. ఎస్పీ జానకీ షర్మిలను ప్రజలు ఊరేగించారు. గ్రామానికి తీసుకెళ్లి తమ సంతోషంలో భాగం చేశారు. అనంతరం మంత్రి సీతక్కకు ఫోన్ చేసిన జానకి దిలావర్‌పూర్ ప్రజలతో మాట్లాడించారు.
Also Read: ఇథనాల్ పరిశ్రమ వివాదంలో బిగ్ అప్‌డేట్- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక