BRS Working President KTR Satires On CM Revanth Reddy : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయడం పట్ల భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు (కేటీఆర్) మండిపడ్డారు. గతంలో ఇదే బాటలో నడిచిన మాజీ సీఎం కేసీఆర్ పట్ల కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రధానితో సమావేశాలను బహిష్కరించాలని అప్పట్లో కెసిఆర్ నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించిందన్నారు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయంటూ అంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీతి అయోగ్ సమావేశానికి వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయం పట్ల ఏం చెబుతుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రిని కలవాలని, రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ సమస్యల గురించి మాట్లాడాలని ఎందుకు అనుకోవడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కేడర్ ను కేటీఆర్ ప్రశ్నించారు.
నీతి అయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేయడం పట్ల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చర్చ జరిపింది. ఈ చర్చల్లో పాల్గొన్న పలు పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. 'కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం' అనే తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపగా బిజెపి మాత్రం వాకౌట్ చేసింది. ఈ చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ నీతి అయోగ్ మీటింగ్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ బహిష్కరించగా, తమ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు దూరంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రకటన సర్వత్ర ఆసక్తిని రేకెత్తించింది. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ తరహా సమావేశాలను, ప్రధానితో మీటింగ్ కు దూరంగా ఉన్నారని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించిందని, తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు.
గతంలో కెసిఆర్ పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి..
నీతి అయోగ్ మీటింగుకు సీఎం కేసీఆర్ హాజరుకావాలని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానిని ప్రశ్నించేందుకు ఇది మంచి అవకాశంగా గతంలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు కేసీఆర్ నీతి అయోగ్ మీటింగ్ కు వెళ్తానంటే తామే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని, ఈ మీటింగ్ కు కేసిఆర్ హాజరు కాకుంటే ప్రధాని మోడీకి లొంగినట్టేనని ఆరోపించారు. తాజాగా అదే నీతి అయోగ్ మీటింగుకు వెళ్ళనంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల కెసిఆర్ సహా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
Also Read: చెరో దారిలో ఇద్దరు మిత్రులు - బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ ఇక కలసి రాజకీయం చేయలేవా ?
గతంలో కేసీఆర్ ఏమన్నారంటే..
నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని, నీతి అయోగ్ చేసిన సిఫార్సులను కేంద్ర పట్టించుకోనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అప్పట్లో ఈ ప్రకటనపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బిజెపితో కేసీఆర్ కుమ్మక్కు కావడం వల్ల ఇలా చేస్తున్నారంటూ ఆరోపించారు.
Also Read: మాకన్నా ఎక్కువ అప్పులు చేస్తున్నారు, 6 గ్యారంటీల ఊసే లేదు - హరీశ్ రావు