Hyderabad News: సినిమా పిచ్చి..ఈ మాట తరుచూ వింటుంటాం. ఎందుకంటే ఆ పిచ్చి ఉన్న వాళ్లు ఏమైనా చేస్తారు..? దేనికైనా తెగిస్తారు. ఒక్కసారి ఈ పిచ్చి పట్టుకుంటే అంత తొందరగా వదలదు. మనం చేస్తున్నది తప్పా..? ఒప్పా..? అన్న ఆలోచన కూడా రాదు. అలాంట సినిమా పిచ్చి ఉన్న ఓ యువకుడు ఏకంగా చోరీలు చేసి మరీ షార్ట్‌ఫిల్మ్‌లు(Short Film) తీశాడు. డైరెక్టర్(Director) అవుదామని కలలు కన్న ఆ యువకుడు చివరికి దొంగతనాలతో విలన్‌గారి కటకటాలపాలయ్యాడు.
దొంగ డైరెక్టర్
సినిమా పిచ్చా ఆ యువకుడిని సిక్కోలు నుంచి భాగ్యనగరానికి రప్పించింది. డైరెక్టర్ అవ్వాలన్న ఆశతో ఫిల్మ్‌నగర్(Film Nagar) చుట్టూ చక్కర్లు కొట్టాడు. అనుకున్నదే తడవుగా అవకాశాలు వస్తాయని ఆశపడి వచ్చిన ఆ యువకుడికి నిరాశే ఎదురైంది. పూటగడవడం కష్టమైంది... ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా అతనికి అవకాశం దక్కలేదు. ఏం చేసైనా ఇక్కడే ఉండాలి, సినీపరిశ్రమలోనే నిలదొక్కుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఉండటానికి, తినడానికి కష్టమవ్వడంతో దారితప్పాడు. చోరీలు మార్గం ఎంచుకున్నాడు. పగలంతా రెక్కీ నిర్వహించడం...అర్థరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి చొరబడి తెల్లవారుజాముకల్లా మొత్తం ఊడ్చేసి చెక్కేయడం నేర్చుకున్నాడు. దొంగిలించిన సొమ్ముతో జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. ఇదేదో బాగుందనుకున్నాడో ఏమోగానీ దొంగతనాలను కంటిన్యూ చేయడం ప్రారంభించాడు. డైరెక్టర్(Director) అవ్వాలంటే ముందు తానేంటో నిరూపించుకోవాలనున్నాడు. అందుకే దొంగిలించిన సొమ్ముతో ఓ షార్ట్‌ఫిల్మ్(Short Film) కూడా తీశాడు.
Also Read: 'మీకు దండం బాబూ ఒక్క రూపాయీ లేదు' - సీసీ కెమెరా ముందు దొంగ సైగలు, పెర్ఫార్మెన్స్ అదుర్స్
కటకటాలపాలు
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాకు చెందిన అప్పలనాయుడు(Appalanaidu)..సినిమాలపై మోజుతో హైదరాబాద్ వచ్చాడు. డైరెక్టర్ కావాలన్నది అతని కల. సొంత ఊరి నుంచి హైదరాబాద్(Hyderabad) చేరుకున్న అతనికి ఇక్కడ నిరాశే ఎదురైంది. బతకడం కోసం దొంగతనాలను మార్గంగా ఎంచుకుని అందులో ఆరితేరిపోయాడు. హైదరాబాద్‌లో దొంగతనం చేస్తే పట్టుబడిపోతామని...పైగా సీసీ కెమెరాల గొడవ ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీసులు ఇట్టే పట్టేస్తారని పసిగట్టాడు. అందుకే తెలంగాణనలో ఇతర పట్టణాలపై దృష్టి సారించాడు. ఇటీవల మక్తల్ లోని చిగుళ్లపల్లి రాఘవేంద్రరావు ఇంట్లో చోరీ చేశాడు.ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా చాకచక్యంగా జొరబడి 40 తులాల బంగారం దొంగిలించాడు. గౌడవెల్లి రాములు అనే వారి ఇంట్లో నుంచి మరో 20 తులాల బంగారు ఆభరణాలు కాజేశాడు. 35 తులాల వెండి, 4 లక్షల నగదు అపహరించాడు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని ఆ డబ్బులతో జల్సాలు చేశాడు.
డబ్బులన్నీ అయిపోగానే మళ్లీ ఈసారి నారాయణపేట వెళ్లాడు. అశోక్‌నగర్‌లో అబ్రేష్‌కుమార్‌కు చెందిన ఇంట్లోకి చొరబడి రెండున్నర తులాల బంగారం చోరీ చేశాడు. ఇవేగాక మరో ఆరు చోట్ల చోరీలకు పాల్పడి ఇళ్లన్నీ దోచుకున్నాడు. ఇలా చోరీలు చేసిన సొమ్ముతోనే ఓ షార్ట్‌ఫిల్మ్ తీశాడు. మిగిలిన డబ్బులో హైదరాబాద్, రాయచూర్‌లో పేకాట ఆడుతూ జల్సాలు చేస్తున్నాడు. వరుస చోరీలతో అప్రమత్తమైన పోలీసుులు నిఘా పెట్టడంతో అప్పలనాయుడు పట్టుబడ్డాడు. మొత్తం 90 చోరీ కేసుల్లో అప్పలనాయుడు నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని నుంచి 75 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. ఆశ, ఆశయం మంచిదే అయినా దాన్ని చేరుకునే మార్గం కూడా సరైనదే ఉండాలి. లేకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.
Also Read: అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన - మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు, కోడిగుడ్లతో దాడి