YCP False propaganda about political murders in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హత్యలు జరిగిపోతున్నాయంటూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది. 50రోజుల్లో  36 మంది వైసీపీ కార్యకర్తల్ని చంపేశారని ..వందల ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారని ఆరోపించారు. సాధారణంగా ఎన్నికల అనంతర హింస ఏ రాష్ట్రంలో అయినా ఉంటుంది. ఎన్నికల రోజే ఏపీలో భయంకరమైన హింస చోటు చేసుకుంది. ఆ హింసతో పోలిస్తే ఫలితాల అనంతరం పీస్‌ఫుల్‌గా ఉన్నట్లే. కానీ వైఎస్ఆర్‌సీపీ మాత్రం హత్యలు జరిగిపోతున్నాయని తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తూ.. ధర్నాను ఢిల్లీకి తీసుకెళ్లింది. 


36 హత్యలకు సంబంధించిన వివరాలపై వైఎస్ఆర్‌సీపీ మౌనం


50 రోజుల్లో 36 హత్యలు జరిగాయని వైసీపీ అధినేత జగన్ స్వయంగా చెబుతున్నారు . ఆ లెక్క ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ ఆయన మాత్రం ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ అంశంపై కొంత మంది మీడాయా ప్రతినిధులు ఆరా తీశారు.  హత్యకు గురైన ముప్పయి ఆరు మంది జాబితా ఇవ్వాలని కోరారు. కానీ వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. నిజానికి 36 మంది హత్యకు గురి కావడం అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద ఇష్యూనే. అంత పెద్ద స్థాయిలో హత్యలు జరిగాయని వైఎస్ఆర్‌సీపీ అనుకూల మీడియాలో కూడా ఎప్పుడూ వార్తలు రాలేదు. ఆ లెక్క ఎలా వచ్చిందో కానీ వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అసెంబ్లీలీ ఈ అంశంపై మాట్లాడిన హోంశాఖ మంత్రి వంగల పూడి అనిత.. ఆ 36 మంది హతుల జాబితా ఇస్తే.. విచారణ చేయిస్తామని ప్రకటించారు. కానీ వైసీపీ వైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. 


ఢిల్లీ ధర్నాతో జగన్ ఇరుక్కపోయారా ? ఇక బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాల్సిందేనా ?


నాలుగు హత్యలు అందులో ముగ్గురు టీడీపీ వారే అని పోలీసుల ప్రకటన


ఎన్నికల అనంతరం రాజకీయ కారణాలతో గ్రామాల్లో గొడవల కారణంగా మొత్తంగా నాలుగు హత్య కేసులు నమోదయ్యాయని పోలీసులు ప్రకటించారు. అ హత్య కేసుల్లో ముగ్గురు టీడీపీకి చెందిన వారు కాగా ఒక్కరే వైఎస్ఆర్‌సీపీకి చెందిన వారని తేల్చేశారు. ఇక రాజకీయాలతో సంబంధం లేని హత్య కేసులు కూడా 36  లేవని పోలీసులు చెబుతున్నారు. మరి రాజకీయ హత్యలు అంత ఎక్కువగా జరుగుతున్నాయని వైసీపీ ఎలా ప్రచారం చేస్తుందో రాజకీయ వర్గాలకూ  అర్థం కావడం లేదు. ఫోటో ప్రదర్శన పెట్టారు కానీ..  అవి ఫోటో షూట్‌లగానే ఉన్నాయి కానీ.. నిజమైన బాధితులా కాదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. చంపేశారని  గట్టిగా చెబుతున్న వైసీపీ వారి జాబితాను జాతీయ మీడియాకు ఇచ్చి ఉంటే మరింత ఫోకస్ వచ్చి ఉండేదన్న అభిప్రాయం ఉంది. కానీ వైసీపీ చేస్తున్నది ఫేక్ ప్రచారమేనని అందుకే డీటైల్స్ ఇవ్వలేకపోతోందని టీడీపీ వర్గాలంటున్నాయి. 


రాష్ట్రపతికి ఎందుకు ఫిర్యాదు చేయకుండా వచ్చేశారు ?


ఇండియా కూటమి  నేతల్ని పిలిచి  రాజకీయంగా హడావుడి చేశారు కానీ.. ముందుగా చెప్పినట్లుగా రాష్ట్రపతికి , ప్రధానికి, కేంద్ర హోంమంత్రిగా ఫిర్యాదు చేయకుండానే తిరిగి వచ్చేశారు. అపాయింట్‌మెంట్లు దొరకలేదని  వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రధాని, హోంమంత్రి కాకపోయినా ఓ మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఆయనకు సులువుగా వచ్చేదని చెబుతున్నారు. కానీ రాష్ట్రపతికి ఇవే వివరాలను ఫిర్యాదు చేస్తే సమస్యలు వస్తాయన్న కారణంగా  వెనక్కి వచ్చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాష్ట్రపతికి చేరే ప్రతి ఫిర్యాదును.. కేంద్ర హోంశాఖకు పంపుతారు. హోంశాఖ దానిపై ఖచ్చితంగా నివేదిక రెడీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇదంతా  తప్పుడు ఫిర్యాదు అని నివేదిక ఇస్తే.. వైసీపీకి నెగెటివ్ అవుతుంది. అలాగే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినా అదే పరిస్థితి వస్తుంది. 


ఏపీలో భూమిపత్రాలపై చంద్రబాబు బొమ్మలంటూ ప్రచారం - ఇదిగో అసలు నిజం


ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలనుకుంటున్నారా ?


ఏపీలో ఏదో జరిగిపోతోందని జగన్ హడావుడి చేయడం వెనుక రాజకీయ స్వార్థం ఉందని..  కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  పెట్టుబడుల పరంగా.. అమరావతి పరంగా వస్తున్న పాజిటివ్ వాతావరణాన్ని భగ్నం  చేయాలన్న ఉద్దేశంతోనే జగన్ , వైసీపీ ఈ ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల కాలంలో జగన్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా సాక్ష్యాలతో సహా బయటకు వస్తున్న సమయంలో ఆయన ఇలా చేయడం వెనుక రాజకీయ స్వార్థం ఉందంటున్నారు. కారణం ఏదైనా .. 36 హత్యలంటూ జగన్ చెప్పిన లెక్క విషయంలో ఆయన చివరికి ఆధారాలు సమర్పించాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.