Will KCR come to the Assembly every day : తెలంగాణ అసెంబ్లీలో గురువారం కాస్త ప్రత్యేకం. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఆయన వస్తారా రారా అన్న చర్చోపచర్చల తర్వాత బడ్జెట్ ప్రసంగం వినేందుకు అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత మీడియా పాయింట్ లో ప్రభుత్వంపై విమర్శలు చేసి వెళ్లారు. ప్రభుత్వం రెండో తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి మిగిలిన రోజుల సభలకూ కేసీఆర్ వస్తారా ? ప్రభుత్వాన్ని నిలదీస్తారా ?  అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. 


కేసీఆర్ ఇక రోజూ సభకు వస్తారా ?                                   


కేసీఆర్ సభకు రావడం లేదని కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ సభ్యులను  టీజ్ చేసేందుకూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికి సమాధానంగా బుధవారం  కేటీఆర్ మీకు మేము చాలని కేసీఆర్ అవసరం లేదని అన్నారు. కానీ రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పదే పదే కేసీఆర్ ప్రస్తావన తీసుకు వస్తోంది.  కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదన్నది మాత్రం  బీఆర్ఎస్ చెప్పలేకపోతోంది. బడ్జెట్ ప్రసంగం వినేందుకు వచ్చినా సభలో ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ఆయన చర్చలకు హాజరు కాకపోవడాన్ని బీఆర్ఎస్ సమర్థించుకోలేకపోతోంది.  


కేసీఆర్ చర్చలకు రాకపోవడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కాంగ్రెస్     


కేసీఆర్ సభకు వచ్చే ఉద్దేశం లేకపోతే ప్రతిపక్ష నేత హోదా ఆయన తీసుకోకుండా ఉండాల్సిందని   కేటీఆర్, హరీష్ రావు ల్లో  ఎవరికి ఆ  బాధ్యత ఇచ్చినా వారి ఎదురుదాడికి వెయిట్ వచ్చేదన్న అభిప్రాయం ఉంది. ఎంతగా తమను డిఫెండ్ చేసుకున్నా...   వారు సాధారణ సభ్యుల కిందే వస్తారు.  ప్రతిపక్ష నేత కౌంటర్ ఇచ్చినట్లుగా కాదు. వీరిద్దరిలో ఎవరికైనా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి ఉంటే..  అ వాయిస్‌కు మరింత  బలం వచ్చి ఉండేది.  ప్రతిపక్ష హోదా తీసుకున్న కేసీఆర్ సభకు రాకుండా ఇతరులు మాట్లాడుతూండటంతో  దాన్నే అడ్వాంటేజ్ గా కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్నారు.  


రెండో తేదీ వరకు సమావేశాల పొడిగింపు 


టైగర్ అసెంబ్లీకి వస్తుందని కేటీఆర్ ఐైదారు నెలల కిందటి నుంచి  చెబుతూ వస్తున్నారు. తీరా అసెంబ్లీ ప్రారంభమయ్యే సరికి స్పష్టత ఉండటం లేదు. ఎమ్మెల్యేలతో తన ఇంట్లో సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు కానీ..  సభ కు మాత్రం రావడం లేదు. ఇప్పుడు బడ్జెట్ ప్రసంగం వినేందుకు వచ్చారు. బడ్జెట్ ను చీల్చి చెండాడుతామని ప్రకటించారు. అంటే ఆయన అసెంబ్లీకి వస్తారా అని ఇతర పార్టీలు ఆరా తీస్తున్నాయి.   కేసీఆర్ సభకు వచ్చి రేవంత్ పై ఎదురుదాడి చేస్తేనే.. సమఉజ్జీల సమరం నడుస్తుందని  లేకపోతే అడ్వాంటేజ్ రేవంత్ అన్నట్లుగా సభ సాగిపోతుందని అంటున్నారు. మరి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో ?