ఆరు రోజుల క్రితం మ్యాన్‌హోల్‌లోకి దిగి చిక్కుకుపోయిన జీహెచ్ఎంసీ కార్మికుడు అంతయ్య మృతదేహం ఎట్టకేలకు దొరికింది. సోమవారం మధ్యాహ్నం రెస్క్యూ సిబ్బంది ఆయన మృతదేహం కోసం గాలిస్తుండగా లభ్యమైంది. మ్యాన్‌హోల్‌లో చిక్కుకుపోయిన ప్రదేశం నుంచి దాదాపు 350 మీటర్ల దూరంలో అంతయ్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది కనుగొన్నారు.
ఆరు రోజుల క్రితం ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు వనస్థలిపురం సమీపంలోని సాహెబ్ నగర్‌లో మ్యాన్ హోల్‌లోకి దిగి శుభ్రం చేస్తుండగా లోపలే చిక్కుకుపోయారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు మొదలు పెట్టారు. వీరిలో శివ అనే కార్మికుడి మృత దేహం లభ్యమైంది. కానీ, అంతయ్య జాడ కనిపించలేదు. ఇక అప్పటి నుంచి రెస్క్యూ సిబ్బంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో గాలింపు చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నాలాలను తవ్వి తీసి మరీ గాలించారు. అయినా అంతయ్య జాడ దొరకలేదు.
Also Read: Hyderabad Realtor Murder: రియల్టర్ హత్య కేసులో మలుపు.. ఓ మాజీ ఎమ్మెల్యే హస్తం..! అసలు సంగతి ఏంటంటే..
చివరికి బెంగళూరుకు చెందిన ఓ సాంకేతికత సాయంతో కెమెరా పరికరాలతో గాలింపు చేపట్టారు. దీంతో మృతదేహం జాడ దొరికింది. కొద్దిసేపటికే పక్కనే ఉన్న మ్యాన్ హోల్ వద్దకి మృతదేహాం వచ్చి ఆగిపోయింది. దీంతో అధికారులు వెంటనే అంతయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే స్థానికులు అంతయ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, తగిన పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.
అధికారులకు రేవంత్ రెడ్డి ఫోన్
మరోవైపు, జీహెచ్ఎంసీ కార్మికుడు అంతయ్య మృతదేహం ఆరు రోజులైనా కనిపించకపోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇద్దరు దళితులైన కార్మికులు చనిపోతే అధికారులెవరూ ఘటనా స్థలాన్ని సందర్శించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం (ఆగస్టు 7) జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలపై అసహనం వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం సహా తగిన నష్ట పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కనుక ఆలస్యం చేస్తే మానవత్వం లేనట్లే అవుతుందని ట్వీట్ చేశారు.
Also Read: Dalitha Bandhu, Huzurabad: హుజూరాబాద్‌లో దళిత బంధు అమలు.. నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు