నీరజ్ చోప్రా... ఇప్పుడు భారతదేశంలో ఈ పేరు తెలియని వారుండరు. అమ్మాయిలకు అయితే ఒక్కసారిగా కలల రాకుమారుడు అయిపోయాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో ఏకంగా స్వర్ణ పతకమే గెలిచి యావత్తు భారతదేశం గర్వించేలా చేశాడు నీరజ్ చోప్రా. క్రీడా  గ్రామంలో ఉన్న నీరజ్ చోప్రాతో ‘ABPన్యూస్’ప్రత్యేకంగా మాట్లాడింది. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్... నీరజ్ చోప్రాపై ప్రశ్నల వర్షం కురిపించారు.



ఈ నేపథ్యంలో కపిల్ దేవ్... 23 ఏళ్ల నీరజ్ చోప్రాతో పెళ్లి గురించి ప్లాన్స్ ఏంటి అని అడిగారు. ‘నా దృష్టి అంతా స్పోర్ట్స్ పైనే. మిగిలిన పనులు వాటంతట అవి జరుగుతుంటాయి. ప్రస్తుతం నా మొత్తం ఫోకస్ అంతా స్పోర్ట్స్ పైనే’ అని నీరజ్ కాస్త సిగ్గుపడుతూ, నవ్వుతూ బదులిచ్చాడు. 
‘చిన్నప్పుడు కాస్త లావుగా ఉండేవాడిని, ఫిట్‌నెస్ కోసం కుటుంబసభ్యులు అథ్లెటిక్స్ ట్రైనింగ్‌కి పంపారు. ట్రైనింగ్ కోసం స్టేడియానికి వెళ్లిన సమయంలో కూడా నా మనసులో ఆటల గురించి ఎలాంటి ప్లాన్ లేదు. దేశానికి ఆడాలి, పతకాలు గెలవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా కుటుంబం సభ్యుల్లో, మా గ్రామంలో ఎవరూ స్పోర్ట్స్ వాళ్లు లేరు. నేను ఎప్పుడూ జావెలిన్ త్రో ఛాంపియన్ అవుతానని అనుకోలేదు. కానీ, ఆ తర్వాత చాలా కష్టపడ్డాను. ప్రతి ఒక్కరి నుంచి మంచి సపోర్టు దొరికింది’ అని కపిల్ అడిగిన పలు ప్రశ్నలకు నీరజ్ బదులిచ్చాడు. 



 


స్వర్ణాన్ని దిండు పక్కనే పెట్టుకుని


స్వర్ణాన్ని గెలిచిన రాత్రి ఆ పతకాన్ని తన దిండు పక్కన పెట్టుకుని నిద్రపోయినట్లు నీరజ్‌ చోప్రా చెప్పాడు. ‘‘స్వర్ణం సాధించిన రాత్రి పతకాన్ని దిండు పక్కనే పెట్టుకుని నిద్రపోయా. చాలా ఆనందంగా అనిపించింది. పోటీల వల్ల బాగా అలసిపోవడం వల్ల మంచి నిద్ర పట్టింది. టోక్యో వచ్చినప్పటి నుంచి సరిగ్గా నిద్ర పోలేదు. ఎందుకంటే నేను స్వీడన్‌లో శిక్షణ తీసుకున్నాను. అక్కడికి టోక్యోకి టైమింగ్‌లో చాలా తేడా ఉంది’ అని నీరజ్‌ చెప్పాడు.


లక్ష నుంచి 28 లక్షలు


ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్‌ చోప్రా రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. సామాజిక మాధ్యమాల్లో అతడిని అనుసరించే అభిమానుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. పసిడి సాధించక ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో నీరజ్‌ను అనుసరించేవాళ్ల సంఖ్య లక్ష ఉండగా.. స్వర్ణం గెలిచాక ఏకంగా 28 లక్షలకు చేరుకోవడం విశేషం. ట్విటర్‌లోనూ అతడిని 3 లక్షలకుపైగా అనుసరిస్తున్నారు.


తదుపరి లక్ష్యం 90 మీటర్లు


జావెలిన్‌ త్రో టెక్నిక్‌తో కూడుకున్నఆట అని, ఆ రోజు ఫామ్‌పై ఎంత వరకు విసిరే దానిపై ఆధారపడి ఉంటుందని అన్నాడు నీరజ్. 90 మీటర్లను దాటడమే తన తదుపరి లక్ష్యమని చెప్పాడు. ఈ ఏడాది ఒలింపిక్స్‌పైనే దృష్టి సారించా. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాను కాబట్టి త్వరలో జరగబోయే టోర్నీల గురించి ఆలోచిస్తానని నీరజ్ తెలిపాడు.