ఆంధప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని హైదరాబాద్‌లో కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెంగళూరుకు చెందిన ఓ గురూజీ పాత్ర ఉన్నట్లు పోలీసులు మొదటినుంచీ అనుమానిస్తున్నారు. అయితే, తాజాగా పోలీసులు ఈ కేసులో కొత్త కోణం గుర్తించారు. ఓ మాజీ ఎమ్మెల్యే హస్తం కూడా ఈ కుట్రలో ఉండి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


కేపీహెచ్‌బీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న విజయ్ భాస్కర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని నగర శివారులో హతమార్చిన సంగతి తెలిసిందే. అతణ్ని శ్రీశైలం వైపునకు తీసుకెళ్లి సున్నిపెంటలోని ఓ శ్మశాన వాటికలో శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలోనే అనుమానం వచ్చిన కాటికాపరి ఆ శవం చితిపై ఉండగానే ఫొటో తీసుకున్నాడు. ఆ ఆధారమే పోలీసులకు కీలకంగా మారింది. మరోవైపు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య వెనుక ప్రధాన సూత్రధారి త్రిలోక్ నాథ్ అలియాస్ గురూజీ పేరు ఉన్నందున ఆయన పేరు బయటకు రాకుండా శిష్యులు పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ నలుగుర్ని అరెస్ట్‌ చేశారు.


Also Read: Gold-Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా.. నేటి తాజా ధరలు ఇవే..


ఓఆర్‌ఆర్‌ వద్ద మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి దహనం చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. ఆ స్థలం చూపించాలని కోరగా నిందితులు తికమక పెట్టారని, చివరకు తమదైన శైలిలో విచారణ జరిపితే అసలు విషయం చెప్పారని పోలీసులు చెప్పారు. అయితే, స్థిరాస్తి వివాదం, ఆర్థికపరమైన మనస్పర్థల వల్ల విజయ్ భాస్కర్‌ను అంతమొందించారని తొలుత పోలీసులు భావించినా.. మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. 


సదరు గురూజీతో కలిసి ఓ మాజీ ఎమ్మెల్యే సుమారు పదేళ్ల నుంచి గుప్త నిధుల కోసం వెతుకుతున్నారని తేలింది. భూమిలో నిక్షిప్తమైన విలువైన లోహాల కోసం వారు వివిధ చోట్ల చాలా కాలంగా అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మృతుడు విజయ్ భాస్కర్ వారిద్దరిపై తప్పుడు ప్రచారం చేశారని, ఆ ఉక్రోషంతోనే వారు హత్య చేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రధాన అనుమానితుడిగా ఉన్న గురూజీ కోసం పోలీసులు మూడు బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు. ఆ గురూజీ ప్రతి పౌర్ణమికి కావలి బీచ్‌లోని దేవాలయానికి వచ్చే అలవాటు ఉందని పోలీసులు గుర్తించారు.


Also Read: Hyderabad Cyber Crime: ఈ యాప్ వాడారో ఇక అంతే.. తస్మాత్ జాగ్రత్త.. కొత్త కుంభకోణం వెలుగులోకి..