గతేడాది తెలుగు రాష్ట్రాల్లో సూక్ష్మ రుణ యాప్‌లు సృష్టించిన కుంభకోణాలు అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ వల్ల అవసరం ఉన్న వారికి సులభంగా రుణాలు ఇచ్చేసి, వాటిని వసూలు చేసేందుకు విపరీతమైన వేధింపులు చేశారు. దాంతో పరువు పోతుందని భావించి ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తాజాగా అలాంటి మోసం మరొకటి జరిగింది. రుణయాప్‌ల పేరుతో భారీగా వడ్డీలు వసూలు చేసిన చైనీయులు మోసానికి తెగబడ్డారు. తమ సంస్థల్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ అమాయకులను నమ్మించి బురిడీ కొట్టించారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ బండారం మొత్తం బయటికి వచ్చింది.
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన అడబాల శ్రీనివాసరావు, నల్లకుంటకు చెందిన నరాల విజయ్ కృష్ణ అనే వ్యక్తులు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. పోయిన నెలలో వీరికి ఇద్దరు చైనాకు చెందిన వ్యక్తులు పరిచయం అయ్యారు. మరో మార్గం ద్వారా ఆదాయం వస్తుందని ఆశపెట్టి ‘మాల్ 008’ పేరుతో ఫేక్ సంస్థను ప్రారంభించి ఆ ఇద్దరినీ డైరెక్టర్లుగా ఆ చైనీయులు ఉంచారు. నెలకు ఒక్కొక్కరికి రూ.15 వేల వరకూ జీతం ఇస్తామని నమ్మబలికారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘మాల్ 008’ పేరుతో యాప్ కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఈ క్రమంలో ఈ యాప్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే రోజుకు ఏకంగా రూ.5 వేలు లాభం వస్తుందని నమ్మబలికారు. ఇంటి నుంచి పని చేసేవారు, గృహిణులు ఇలా ఈ యాప్‌పై పని చేస్రతూ కమీషన్ పొందవచ్చని ప్రకటనలు భారీగా ఇచ్చారు. దీన్ని నమ్మిన బేగంపేటకు చెందిన ఓ మహిళ ఇందులో చేరి లావాదేవీలు నిర్వహించారు. కమీషన్‌గా ఆమెకు డబ్బులు ఆమె అకౌంట్‌లో పడడంతో నమ్మకం కుదిరింది.
బాగుందని ఆశతో రూ.2.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. డబ్బులు రాకపోయేసరికి చివరకు మోసపోయినట్టు గ్రహించిన ఆమె హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి సారథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసుల టీమ్ దీనిపై విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మోసపోయిన మహిళ తరహాలోనే సుమారు రూ.15 కోట్ల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.
ఆ యాప్ వెనుక సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు కూడా వినియోగదారుల తరహాలోనే నటించాల్సి వచ్చింది. తాము పెద్దమొత్తంలో వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు నమ్మకం కలిగించారు. ఈ క్రమంలోనే నిందితులు అడబాల శ్రీనివాసరావు(45), నరాల విజయ్‌కృష్ణ(37) పోలీసులకు దొరికిపోయారు. వారిని శనివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో బోగస్ సంస్థ బండారం వెలుగుచూసింది. వారిద్దరిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి డెబిట్ కార్డులను పోలీసులు సీజ్ చేశారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.19 లక్షల సొమ్మును స్తంభింపజేశారు. వారి ద్వారా యాప్‌ను ప్రారంభించిన చైనీయులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విచారణలో మరో విషయం వెలుగుచూసింది. ఢిల్లీలో 5 లక్షల మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వారంతా ఈ తరహా యాప్‌ల బాధితులేనని పోలీసులు కనుగొన్నారు. ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీలోనూ చైనాకు చెందిన సంస్థ ఇలాగే పెట్టుబడుల పేరుతో 5 లక్షల మందిని మోసగించినట్టు అక్కడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ వ్యవహారంలో పోలీసులు 11 మంది నిందితులను గతంలోనే అదుపులోకి తీసుకున్నారు.