మాజీ ఉప ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు సొంత పార్టీలో అసంతృప్తి పెరిగినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఆదివారం రోజు వీరిద్దరూ కలిసి కొన్ని విషయాలు చర్చించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో కాకుండా మరో స్థలంలో వీరి భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. తాటికొండ రాజయ్య కొద్ది రోజులుగా బ్రదర్ అనిల్‌తో తరుచుగా సమావేశమవుతున్నట్లుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే, ఈ భేటీ రాజకీయంగానా లేక మతపరంగానా అనే అంశంపై ఎలాంటి స్పష్టతా లేదు.


ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బ్రదర్ అనిల్ కుమార్‌ను కలిసినట్లు వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాజయ్యపై టీఆర్ఎస్ నాయకత్వం చర్యలు తీసుకొనే అవకాశం కూడా లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 


అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా..
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తాటికొండ రాజయ్య టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. కేసీఆర్ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి, వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బాగా వ్యాప్తి చెందిన స్వైన్ ఫ్లూ‌ను అరికట్టడంలో విఫలం చెందారనే కారణాలతో మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆ తర్వాత తాను ఏ తప్పూ చేయలేదని, అయినా తనపై చర్యలు తీసుకున్నారని రాజయ్య వివరణ ఇచ్చారు. అయినా అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని రాజయ్య కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత రాజయ్యకు కేసీఆర్ ఏ పదవీ ఇవ్వలేదు.
Also Read: బంధు వర్సెస్ దండోరా ! కేసీఆర్ - రేవంత్.. ఆ వర్గాల్లో ఎవరు చాంపియన్లు అవుతారు..? 


గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసలు తాటికొండ రాజయ్యకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా? అనే ప్రశ్న సైతం తలెత్తింది. కానీ సీఎం కేసీఆర్ ఆయనకు అదే స్టేషన్ ఘన్‌పూర్ స్థానం నుంచి టికెట్ కేటాయించారు. ఆయన గెలిచినా కేసీఆర్ మళ్లీ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అప్పటి నుంచి కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అంతేకాక, వరంగల్ జిల్లాలోని టీఆర్ఎస్ సీనియర్ నేత అయిన కడియం శ్రీహరితో తాటికొండ రాజయ్యకు ఏ మాత్రం పొసగడం లేదని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తనను పట్టించుకోకపోవడంతో పార్టీకి, రాజయ్యకు మధ్య దూరం పెరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రదర్ అనిల్ కుమార్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.