వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు... ఆ పార్టీకి మధ్య పోరాటం మరింత ముదురుతోంది. రఘురామకృష్ణరాజు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారంటూ విజయసాయిరెడ్డి గత వారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అంతకు ముందు పార్టీ ఎంపీలందరితో కలిసి వెళ్లి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రఘురామకృష్ణరాజు బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. తన వ్యాపారాలపై ఫిర్యాదులు చేశారని తెలిసిన తర్వాత రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని.. సూట్ కేసు కంపెనీలు పుట్టించి భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాశారు. ఆ లేఖలకు వివిధ కంపెనీల లావాదేవీలు వాటికి సీఎం జగన్, విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఇలా మొత్తం వివరాలు జత చేశారు. 


రఘురామ ఫిర్యాదును కేంద్ర ఆర్థిక, హోంశాఖకు పంపిన రాష్ట్రపతి 


రాష్ట్రపతి భవన్ రఘురామకృష్ణరాజు లేఖను అందుకున్నట్లుగా ఎంపీకి ఎక్నాలెడ్జ్ మెంట్ పంపింది. అదే సమయంలో ఆ ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలకు కూడా పంపినట్లుగా సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ప్రకటించారు. రాష్ట్రపతి భవన్‌ను తనకు అందిన లేఖలను పోస్ట్ చేశారు.  



తన ఫిర్యాదుపై నిర్మలా స్పందించారని విజయసాయిరెడ్డి ట్వీట్


రఘురామకృష్ణరాజు ఇలా రాష్ట్రపతి భవన్‌ నుంచి వచ్చిన లేఖలను సోషల్ మీడియాలో పెట్టిన కాసేపటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రఘురామకృష్ణరాజు కంపెనీలపై తాను ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతామన్ స్పందించారని సోషల్ మీడియాలో ప్రకటించారు. రఘురామకు చెందిన ఇండ్ - భారత్ కంపెనీలపై త్వరిగతిన విచారణ పూర్తయ్యేలా విచారణ చేస్తామని ఆమె హామీ ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు. అయితే నిర్మలాసీతారామన్ హామీ ఇచ్చినట్లుగా చెబుతున్న లేఖను ఆయన పోస్ట్ చేయలేదు. వాస్తవంగా నిర్మలా సీతారామన్ రాసిన లేఖలో చర్యల గురించి చెప్పలేదు.. ఫిర్యాదు అందిందని ఎక్నాలెడ్జ్ మాత్రమే అందులో ఉంది. 




రఘురామపై అనర్హతా వేటు వేయించేందుకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విజయసాయిరెడ్డి .. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. లోక్‌సభ స్పీకర్‌పై ఒత్తిడి పెంచే వ్యాఖ్యలు కూడా చేశారు. మరో వైపు నుంచి రఘురామ వ్యాపారాలపై దృష్టి పెట్టి ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రతిగా రఘురామకృష్ణరాజు కూడా అదే పని చేస్తున్నారు. సీబీఐ చార్జిషీట్లకు మించిన ఆర్థిక నేరాలు చేశారని వివరాలు రాష్ట్రపతి కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖకి పంపడంతో ఇప్పుడు రఘురామకృష్ణరాజుదే పైచేయి అయినట్లయింది. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన సూచలను సీరియస్‌గా కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖ తీసుకుంటే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం  ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.