కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు ఏకంగా రూ.500 కోట్లను విడుదల చేస్తూ సోమవారం (ఆగస్టు 9) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.500 కోట్లను తెలంగాణ షెడ్యూల్డు కులాల కార్పొరేషన్ (టీఎఎస్‌సీసీడీసీ) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కరీంనగర్ జిల్లా షెడ్యూల్డు కులాల కార్పొరేషన్ ఛైర్మన్, కలెక్టర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు అమలు కానుంది. మరోవైపు, ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ దళిత దండోరా యాత్రను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.
వాసాలమర్రిలో ఇప్పటికే ప్రారంభం
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వాసాలమర్రిలో దళిత బంధు పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4న సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన సందర్భంగా అక్కడ దళిత బంధు ప్రకటిస్తున్నట్లుగా ఆయన అనూహ్య ప్రకటన చేశారు. చెప్పినట్లుగానే మర్నాడు ప్రభుత్వం రూ.7.6 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ గ్రామంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు రూ.10 లక్షల నగదు రేపే విడుదల చేస్తామని సీఎం ప్రకటించగా.. ఆగస్టు 5న దళిత బంధు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రూ.7.6 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
దళితులకు ఇప్పటికే చాలా పథకాలు అమలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలు కారణంగా అవి వారికి సక్రమంగా చేరడం లేదని భావించిన ప్రభుత్వం ఇకపై వారి సమగ్ర అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దళితల సాధికారత సాధించే దిశగా అడుగు వేయాలన్న ఆకాంక్షతో ఈ స్కీంను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సంకల్పించింది.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ... దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు చేరాల్సిన డబ్బులు పక్కదారి పట్టకుండా పక్కా ప్రణాళికతో వారి అభివృద్ధి కోసం ఖర్చు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అధికారులను, లబ్ధిదారులను ఆ దిశగా ప్రోత్సహించేలా కార్యాచరణ రెడీ చేశారు. ఇప్పటికే వాసలమర్రి ప్రజలతో సమావేశమై... పథకం ఎలా వినియోగించుకోవాలి... ఎలా అభివృద్ధి వైపు అడుగులు వేయాలనే అవగాహన పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెట్టే ఛాన్స్ కూడా ఉందంటున్నారు అధికారులు.
ప్రస్తుతానికి హుజూరాబాద్, వాసలమర్రికే పరిమితమైన ఈ పథకాన్ని త్వరలోనే మరిన్ని నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. ఇది ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చేతలతోనే కౌంటర్ ఇవ్వాలని చూస్తోంది.