కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు ఉమ్మడి సమావేశం హైదరాబాద్ లోని జలసౌధలో ఇవాళ జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమాచారం ఇచ్చింది. ఉమ్మడి సమావేశంలో కేంద్రం జలశక్తి మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజిట్ లోని అంశాలు, వాటి అమలు కార్యచరణపై చర్చించనున్నారు. కృష్ణా, గోదావరి నదుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గత నెల 15వ తేదీన గెజిట్ విడుదల చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం స్వాగతించగా, తెలంగాణ తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. గెజిట్‌లోని అంశాలు అమలు చేసి కార్యాచరణ ప్రణాళికను పంపాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గత నెల 28వ తేదీన కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లకు లేఖలు రాసింది. 


ఏపీ, తెలంగాణ మధ్య జలజగడం ఓ కొలిక్కి రాలేదు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ పై రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ గెజిట్‌ను వ్యతిరేకిస్తుంది. ఇటీవల నిర్వహించిన కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల సమావేశానికి తెలంగాణ డుమ్మా కొట్టింది. హాజరు కాలేమని మూడు లేఖలు కూడా రాసింది. ఈ రోజు జరిగే ఉమ్మడి సమావేశానికి కూడా దూరంగా ఉండాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. సుప్రీంకోర్టు, ఎన్జీటీలలో ముఖ్యమైన కేసుల విచారణ ఉన్నందున ఉమ్మడి సమావేశానికి రాలేమని తెలంగాణ తేల్చిచెప్పింది. ఈ విషయంపై రెండు బోర్డులకు లేఖలు రాసింది. తెలంగాణ గైర్హాజరుతో ఇవాళ్టి సమావేశం జరుగుతుందో లేదో అనే సందిగ్ధం కూడా ఉంది. 
Also Read: బంధు వర్సెస్ దండోరా ! కేసీఆర్ - రేవంత్.. ఆ వర్గాల్లో ఎవరు చాంపియన్లు అవుతారు..?


గెజిట్, ఉమ్మడి సమావేశంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగానే సమాలోచనలు చేసింది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను సాధించేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల వాటాపై గట్టిగా పోరాడాలని సీఎం కేసీఆర్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులను మరో రోజున భేటీ నిర్వహించాలని తెలంగాణ జలవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ కోరారు. ఈ బోర్డుల సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతున్న తెలంగాణ.. కృష్ణా జలాల వాటాపై పోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కృష్ణా జలాల్లో నీటి వాటాల నిష్పత్తిని మార్చాలంటూ తెలంగాణ కోరుతోంది. ఏపీ చేపడుతోన్న రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాలువ పనులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపాలని తెలంగాణ కోరుతోంది.


నదీ యాజమాన్య బోర్డుల సమావేశానికి హాజరయ్యేందుకు ఏపీ అంగీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ మాత్రం తాము హాజరవ్వలేమని చెప్పిన ఈ తరుణంలో బోర్డులు ఏ నిర్ణయం తీసుకుంటాయనే దానిపై సందిగ్ధం నెలకొంది.