వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. చేవెళ్ల టు చేవెళ్ల దాదాపుగా 4వేల కిలోమీటర్లు .. 400 రోజుల పాటు చేయనున్నారు. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ.. భరోసా ఇస్తూ.. తండ్రి వైఎస్ చేసిన పాదయాత్రను గుర్తు చేయాలనుకుంటున్నారు. పాదయాత్రగా అధికారానికి దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. కుటుంబంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ తర్వాత ఆ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించాలని అనుకుంటున్నారు.
పాదయాత్రల్లో వైఎస్ వారసత్వం కొనసాగింపు !
పాదయాత్ర అంటేనే గుర్తు వచ్చే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్జి. ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపించి .. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు వైఎస్, ఆయన తనయ షర్మిల సైతం ప్రభుత్వ విధివిధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పాదయాత్రనే అస్త్రంగా ఎంచుకున్నారు. రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడ్డాయా.. తెలంగాణ ప్రజలు, నిరుద్యోగుల కలలు నిజమయ్యాయా? అని తెలుసుకునేందుకు షర్మిల యాత్రను చేపట్టారు. రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా తెలంగాణలో పార్టీ పెట్టానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు.
Also Read : సందడిగా ‘అలయ్ బలయ్’.. గవర్నర్ నృత్యాలు, హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య, పవన్ కల్యాణ్
తండ్రి వైఎస్ అడుగు జాడల్లోనే !
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చేవెళ్లే సెంటిమెంట్ . అందుకే చేవెళ్ల నుంచే ఈ యాత్ర చేపట్టనున్నారు షర్మిల. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు యాత్రను కొనసాగించనున్నారు. 90 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 పార్లమెంట్నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగనుంది. గ్రేటర్ పరిధి మినహా ఆమె పాదయాత్ర సాగుతుంది. పర్యటించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు.. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో భాగంగా స్థానికంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు.
చెప్పినట్లుగానే వంద రోజుల్లో పాదయాత్ర ప్రారంభం !
పార్టీ ఆవిర్భావం నాడే మరో 100 రోజుల్లో పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించారు. ఆ ప్రకారం వంద రోజులు అవగానే షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి వారం రోజులకు సంబంధించి షెడ్యూల్ ఇచ్చారు. బుధవారం చేవెళ్లలో ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం షర్మిల భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అనంతరం చేవెళ్ల, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మీదుగా పాదయాత్ర సాగనుంది.
Also Read: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?
షర్మిల పాదయాత్ర చేపట్టడం రెండో సారి !
ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ప్రజా ప్రస్థానం పేరిట షర్మిల పాదయాత్ర నిర్వహించారు. జగన్ జైల్లో ఉండటంతో అన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె ప్రజల్ని ఆకట్టుకున్నారు. 14 జిల్లాల్లో 116 నియోజకవర్గాలు, 2250 గ్రామాల్లో 230 రోజులపాటు షర్మిల పర్యటించారు. 3,112 కిలోమీటర్ల దూరం యాత్ర చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ యాత్ర దాదాపు 9 నెలలపాటు కొనసాగింది. ఇప్పుడు కేవలం తెలంగాణలోనే దాదాపు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
Also Read: రూ.1.7 లక్షల కోట్లతో రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తాం.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
షర్మిలకు తోడుగా తల్లి విజయలక్ష్మి !
మంగళవరం షర్మిల తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. షర్మిలతో పాటు తన తల్లి విజయమ్మ కూడా ఉంటారు. తెలంగాణలో షర్మిల చేపడుతున్న పాదయాత్రకు తల్లి విజయమ్మ తన మద్దతు తెలిపారు. . రాజన్న రాజ్య స్థాపన కోరుకునే ప్రతి ఒక్కరూ తన బిడ్డకు తోడుగా నిలిచి పాదయాత్రను విజయవంతం .. పాదయాత్రను ఆశీర్వదించాలని విజయమ్మ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
Also Read: హుజూరాబాద్ లో దళితబంధుకు బ్రేక్.. ఈసీ కీలక ఆదేశాలు
వైఎస్, జగన్‌కు లేని సవాళ్లు షర్మిల ముందు !
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ పాదయాత్రలు చేసినప్పుడు ఎదురు కాని సవాళ్లు ఇప్పుడు షర్మిల ముందు ఉన్నాయి. ఒకటి రాష్ట్రం విడిపోవడం .. తెలంగాణలో వైఎస్ ఫ్యాక్టర్ తక్కువగా ఉందన్న అభిప్రాయం ఉండటం. రెండు బలమైన క్యాడర్ లేకపోవడం. మూడు రాజకీయ అనుభవం లేకవడం. వీటన్నింటినీ అధిగమించి పాదయాత్రను సక్సెస్ చేసుకుని రాజన్న రాజ్యం స్థాపిస్తే అద్భుత విజయం లభించినట్లే భావించాలి.