KCR Comments On Dalit Bandhu: ఉమ్మండి నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నేటి మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మోత్కుపల్లి నర్సింహులుపై ప్రశంసల జల్లులు కురిపించారు. మోత్కుపల్లి అంటే పరిచయం అక్కర్లేని వ్యక్తి అన్నారు. తనకు అత్యంత సన్నిహితుడు అని, గతంలో తాము కలిసి పనిచేశామని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి లాంటి నేతకు ప్రజల కష్టాలు బాగా తెలుసునని.. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్‌లో చేరడం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రాణం పోయినా ఆపేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంబేద్కర్ పుణ్యమా అని ఎస్సీలకు రిజర్వేషన్ ఫలాలు అందాయని.. కొంతమంది పిల్లలు చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందారన్నారు. చట్టసభలలో వారికి సరైన ప్రాతినిథ్యం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఎంత పెద్ద యజ్ఞమో అందరికీ తెలుసు.. అలాంటిది దళిత బంధును విజయవంతం చేయడం అంత కంటే పెద్ద యజ్ఞం అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
‘రాష్ట్రంలో భారీ సంఖ్యలో దళితులు ఉన్నారు. దాదాపు 75 లక్షల మంది దళితులు ఉండగా.. వారి వద్ద చాలా తక్కువ భూమి ఉంది. దళితుల వద్ద 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది. జనాభా ఎక్కువగా ఉన్నారు కానీ అవకాశాలు వారికి దక్కలేదు. వారి భూమి ఎవరి వద్ద ఉందో కూడా వారికి తెలియని పరిస్థితి ఉండేది. అందుకే దళితుల కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి నియోజకవర్గానికి దళితబంధును తప్పకుండా అమలు చేసి తీరుతాం.
Also Read: ఈటలను చిత్తు చేయండి.. హరీశ్ రావు వ్యాఖ్యలు, సొంత ఇలాకాలో మంత్రికి షాక్
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. వచ్చే ఏడేళ్ల కాలంలో రూ.1.7 లక్షల కోట్లు దళితబంధుకు ఖర్చు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడితో రూ.10 లక్షల కోట్లు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. దేశంలోని దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచిగా మారాలి. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులు సహా అన్ని వర్గాలవారు బాగు పడతారని ఉద్యమం చేపట్టి, విజయం సాధించాం. కానీ ఎన్నో అవమానాలు భరించాను. చివరికి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు అన్ని వర్గాల వారికి ఫలాలు అందుతున్నాయని’ సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.