Breaking News Live Telugu Updates: నేడు సాయంత్రం ఢిల్లీకి సీఎం కేసీఆర్, రెండు మూడు రోజులు హస్తినలోనే బస!
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
విజయవాడలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 13 జిల్లాల నుండి సిని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు హజరయ్యారు. ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలపై చర్చించారు.పెద్ద సినిమాలను 8 వారాల తరువాత, చిన్న సినిమాలను 4 వారాల తరువాత ఓటీటీలో ప్రదర్శించటం ద్వారా, థియేటర్లు కూడా బతికేందుకు వీలుంటుందని ఆ దిశగా రెండు తెలగు రాష్ట్రాల సినీ పెద్దలు నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తీర్మానించారు. ఇక ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని అంటున్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి పసుపు కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పసుపు క్వింటాల్ కి ప్రభుత్వం మద్దతు ధర రూ.6,850 ప్రకటించగా, అధికారులు దళారులతో కుమ్మక్కై రైతుల దగ్గర 5,500 రూపాయలకు పసుపు కొనుగోలు చేస్తున్నారని రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. తరుగు, ఇతర సాకులు చెప్పి ధరను తెగ్గోస్తున్నారని మండిపడ్డారు రైతు సంఘాల నేతలు. ప్రభుత్వ నిబంధనలు సవరించి ప్రతి రైతు వద్ద పసుపు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మొత్తం 122 హెక్టార్లలో రైతులు పసుపు పండించగా.. ఇప్పటివరకు కేవలం 20 టన్నులు మాత్రమే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అధికారుల తీరుకి నిరసనగా మార్క్ ఫెడ్ కార్యాలయం ముందే పసుపు కొమ్ములు దహనం చేసి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రికి, ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అంటున్నారు రైతులు.
ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం వెంట టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, మంత్రులు కూడా వెళ్లనున్నారు. రెండు మూడు రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే బస చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రగతి భవన్ వర్గాలు ప్రకటించాయి. జాతీయ రాజకీయాల సన్నాహాల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
'పల్లె గోస-బీజేపీ భరోసా' కార్యక్రమం పేరిట ఆదిలాబాద్ జిల్లాకు రానున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను నిలదీస్తామని యువజన కాంగ్రెస్ నాయకులు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఉదయం పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగానే అరెస్టు చేశారు. వారిని జిల్లా కేంద్రంలోని స్థానిక మావల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు ఏ భరోసా ఇవ్వటానికి వస్తున్నారో నిజామాబాద్ ఎంపీ అరవింద్ చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తూ, నిత్యావసర ధరల పేరుతో ప్రజలపై భారం మోపినందుకా.. దేనిపై భరోసా ఇచ్చేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. అరెస్ట్ అయిన వారిలో యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీధర్, రూపేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
భారత దేశ 15వ రాష్ట్రపతిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ ఆమెతో ప్రమాణం చేయించారు. అంతరం సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. దీంతో రాష్ట్రపతి పదవిని అధిష్ఠించిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించారు.
మరికొద్దిసేపట్లో 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి రామ్ నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము అశ్వదళం నడుమ పార్లమెంటు భవనం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ లైవ్ చూడండి.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇందుకోసం ఆమె ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు పార్లమెంటు సెంట్రల్ హాల్ కు బయలుదేరారు. అంతకుముందు ముర్ము బాపూజీకి నివాళి అర్పించారు. అశ్వదళంతో ముర్ము పార్లమెంటుకు బయలుదేరారు.
ఆదిలాబాద్ జిల్లాకు నేడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రానున్న నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని కుమ్రం భీం చౌక్ లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు ఆందోళనకు దారి తీసింది. పురపాలక సంఘంతో కలిసి పోలీసులు ఫ్లెక్సీలను తొలగించారంటూ బీజేపీ నాయకులు కుమ్రం భీం చౌక్ లో రాస్తారోకో చేపట్టారు. ఇది రాష్ట్రపతిని అవమానపర్చటమేనని బీజేపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆరోపించారు. ఆదిలాబాద్ డీఎస్పీ వి. ఉమేందర్ ఘటన స్థలానికి చేరుకొని బీజేపీ నాయకులను నచ్చ చెప్పి ఫ్లెక్సీ ఏర్పాటు చేయటం పట్ల తమకెలాంటి అభ్యంతరం లేదని భరోసా ఇవ్వటంతో ఆందోళనను విరమించారు.
Background
నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో 3 రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఉత్తర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ అలర్ట్ జారీ చేయగా, కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ద్రోణి ఇప్పుడు గంగానగర్, రోహ్తక్, గ్వాలియర్, సిధి, అంబికాపూర్, సంబల్పూర్, బాలాసోర్ మరియు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ప్రయాణిస్తోంది.
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో మరో 3 రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిన ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్రంలో మిగతా జిల్లాలకు సైతం వర్ష సూచన ఉందని, అధిక వర్షపాతం నమోదవుతున్న జిల్లాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలోనూ జూలై 28 వరకు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షం కురవనుంది. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని ఈ 5 ఉమ్మడి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ..
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఉపరితల ఆవర్తనం కారణంగా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర లోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సైతం వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాయలసీమకు మాత్రం ఎలాంటి హెచ్చరికలు లేవని అధికారులు వెల్లడించారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -