CM Chandrababu Comments In WEF Press Meet: ప్రధాని మోదీ టెక్నాలజీకి బలమైన పునాది వేశారని.. తాము ఇక్కడి నుంచి సాంకేతికతను తీసుకెళ్లడం లేదని.. ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఇతర కేంద్ర మంత్రులు, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాల మంత్రులు నిర్వహించిన విలేకరుల సమావవేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశానికి స్వర్ణయుగం ప్రారంభమైందని పేర్కొన్నారు. దావోస్‌లో (Davos) జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో (World Economic Forum) భారత్ తొలిసారి ఒకే వేదికపైకి వచ్చిందని.. ఒకే గొంతుకగా పాల్గొందని అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న రాష్ట్రాలన్నీ పెట్టుబడుల కోసం పోటీ పడుతూనే పరస్పరం ప్రోత్సహించుకున్నట్లు చెప్పారు. విభిన్న రాజకీయ విధానాలు, ఆకాంక్షలు ఉన్నా ఒకటిగా కలిసి పని చేస్తామని తెలిపారు.
'ఇండియా ఫస్ట్' అనేదే మా నినాదం'
తామంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారమైనా.. 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనే నినాదంతో ఉన్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. 'ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తోంది. దాదాపు అన్ని టెక్ కంపెనీల సీఈవోలు భారత సంతతికి చెందినవారే. బ్లూంబర్గ్ అనలిటిక్స్ ప్రకారం 2028 నాటికి జీడీపీ వృద్ధిలో భారత్ అగ్రగామిగా నిలవనుంది. దావోస్‌లో తొలిసారిగా నేను టీమిండియాను చూస్తున్నా. అందరం కలిసి ఒకే చోట ఒకే గళం వినిపిస్తున్నాం.' అని పేర్కొన్నారు.
నేనే సీనియర్..
భారత్ నుంచి దావోస్‌కు హాజరైన వారిలో తానే సీనియర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. 1997లో తొలిసారి ఇక్కడకు వచ్చానని.. అప్పట్లో ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, ఒకటి, రెండు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మాత్రమే వచ్చే వారని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా పోటీ పెరిగిందని పేర్కొన్నారు. 'ఈసారి అద్భుతమైన ఆహ్వానం లభించింది. భారత బృందానికి అత్యుత్తమ గుర్తింపు దక్కింది. ప్రతిచోటా భారతీయ ప్రాతినిధ్యం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్‌ను అందరూ నమ్ముతున్నారు. పర్యావరణ సుస్థిరతలో భాగంగా భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ 165 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సులో భారత్‌ను బాగా ప్రమోట్ చేస్తున్నాం.' అని సీఎం తెలిపారు.
మహారాష్ట్ర ఆర్థికంగా చాలా బలంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. తలసరి ఆదాయంతో పాటు ఇతర ఎకో సిస్టమ్‌లో తెలంగాణ ముందుందని.. ఏపీ వాటి స్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టపడాలని అన్నారు. ఆ దిశగా పని చేస్తున్నామని.. సాధిస్తామన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
చంద్రబాబు టెక్నాలజీ మ్యాన్
పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఒక ఐకాన్ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రశంసించారు. ఆయన్ను టెక్నాలజీ మ్యాన్‌గా అభివర్ణించిన ఆయన.. నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు విజన్ చాలా గొప్పదని కొనియాడారు.