Ind Vs Eng 1st T20 Live Updates: కొత్త సంవత్సరంలో ఆడిన తొలి టీ20లో భారత్ అద్బుత విజయం సాధించింది. అన్ని రంగాల్లో సత్తా చాటిన భారత్.. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్లతో విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79, 5 ఫోర్లు, 8 సిక్సర్లు) స్టన్నింగ్ ఫిఫ్టీతో అదరగొట్టాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి ఇంగ్లాండ్ ఊచకోత కోశాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనను కేవలం 12.5 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి విజయం సాధించింది. తిలక్ వర్మ (19 నాటౌట్) యాంకర్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. 






సంజూ సూపర్ టచ్..
ఇన్నింగ్స్ ఆరంభించిన సంజూ శాంసన్ తొలి రెండు ఓవర్లను తనే ఆడి 23 పరుగులు చేశాడు. ముఖ్యంగా గస్ అట్కిన్సన్ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక కళ్లు చెదిరే సిక్సర్‌తో అదరగొట్టాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత అభిషేక్ కూడా టచ్‌లోకి వచ్చి, ఆర్చర్ బౌలింగ్‌లో ఒక ఫోర్, సిక్సర్ కొట్టాడు. సాఫీగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌కు ఐదో ఓవర్లో కుదుపునకు గురైంది. ఒకే ఓవర్లలో సంజూతో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌ను డకౌట్‌గా ఔట్ చేసి షాకిచ్చాడు. ఆ తర్వాత అభిషేక్-తిలక్ వర్మ జంట భారీ పార్ట్నర్ షిప్‌తో సత్తా చాటింది. వీరిద్దరూ మూడో వికెట్ కు 42 బంతుల్లోనే 84 పరుగులు సాధించారు.  ఓ వైపు బౌండరీలు సిక్సర్లతో అభిషేక్ విరుచుకు పడగా, తిలక్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా రషీద్ బౌలింగ్‌లో లైఫ్ దొరికాక అతని బౌలింగ్‌లోనే రెండు కళ్లు మైమరిపించే సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత మార్క్ వుడ్‌ను కూడా ఊచకోత కోశాడు. ఇలా విరుచుకుపడుతూ కేవలం 20 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకున్నాడు. తర్వాత మరింత దూకుడుగా ఆడిన అభిషేక్ టార్గెట్‌ను కరిగించాడు. చివరకు భారీ షాట్ ఆడబోయి రషీద్ బౌలింగ్‌లో బ్రూక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లో హార్దిక్  పాండ్యా (3 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా తిలక్ వర్మ జట్టును విజయతీరాలకు చేర్చాడు. బౌలర్లలో ఆర్చర్‌కు రెండు వికెట్లు దక్కాయి. వరణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


అర్షదీప్ హవా..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్టింగ్ లోనే రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను అర్షదీప్ చావుదెబ్బ తీశాడు. దీంతో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.  ఓపెనర్ ఫిల్ సాల్ట్ డకౌట్ చేసిన అర్షదీప్.. బెన్ డకెట్ (4) ను  పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో జోస్ బట్లర్, హారీ బ్రూక్ (17) వికెట్ల పతనాన్ని కాసేపు ఆపారు. వికెట్లు పడినా కూడా ఎదురుదాడికి దిగిన ఈ ఇద్దరు సత్ఫలితాన్ని సాధించారు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు ఈ జంట 48 పరుగులు జోడించింది. ఈ దశలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కమాల్ చేశాడు.


ఒకే ఓవర్లో బ్రూక్‌తో పాటు లియామ్ లివింగ్ స్టన్‌ను డకౌట్ చేసి షాకిచ్చాడు. ఒకవైపు బట్లర్ ఒంటరి పోరాటం చేస్తూ 34 బంతుల్లోనే అర్థ సెంచరీ చేయగా, అతనికి సహాకారం అందిచే వారు కరువయ్యారు. స్లోగా ఆడిన జాకబ్ బెతెల్ (14 బంతుల్లో 7)ను హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించాడు. బంతిని పుల్ చేసి అభిషేక్ శర్మ చేతికి చిక్కడంతో బెతెల్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 83 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే బట్లర్ కూడా ఔటవడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించలేకపోయింది. చివర్లో ఆర్చర్ కాస్త వేగంగా ఆడటంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బౌలర్లలో వరుణ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అర్షదీప్, హార్దిక్, అక్షర్ పటేల్ కు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో ఇండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 


Read Also: Arshdeep Singh Record: అదరహో అర్షదీప్ - టీ20ల్లో భారత లీడింగ్ వికెట్ టేకర్‌గా ఘనత, చాహల్‌ను వెనక్కి నెట్టిన పేసర్