India Vs England 1st T20: భారత పేసర్ అర్షదీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే రెండు వికెట్లు తీసిన అర్షదీప్ 97 వికెట్లతో రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ పేరిట ఉంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ముఖ్యంగా అటు పేస్‌కు ఇటు స్పిన్‌కు దాసోహం అవడంతో పది ఓవర్లు ముగిసేసరికే నాలుగు వికెట్లు కోల్పోయింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ మహ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకోలేదు. నెట్‌లో బౌలింగ్ చేసిన షమీ.. తుదిజట్టులోకి ఎందుకు ఎంపిక కాలేదో అర్థం కాలేదు.  తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డిలకు స్థానం దక్కింది. 






17 పరుగులకే ఓపెనర్లు..
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను ఇన్నింగ్స్ మూడో బంతికే అర్షదీప్ ఔట్ చేశాడు. షార్ట్ ఆఫ్ లెంగ్త్ బాల్‌ను ఆడటానికి ప్రయత్నించిన సాల్ట్.. బంతి కాస్త మూవ్ కావడంతో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇంగ్లాండ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరి కాసేపటికే డేజంర్ బెన్ డకెట్ (4) ను కూడా అర్షదీప్ పెవిలియన్‌కు పంపాడు. బంతిని మిడ్ వికెట్ దిశగా ఫ్లిక్ చేయాలని భావించిన డకెట్.. కవర్స్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెనక్కి పరిగెత్తుకుంటూ షోల్డర్ లెవల్లో వచ్చిన బంతిని రింకూ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 


కీలక భాగస్వామ్యం.. 
ఈ దశలో జోస్ బట్లర్, హారీ బ్రూక్ (17) వికెట్ల పతనాన్ని కాసేపు ఆపారు. వికెట్లు పడినా కూడా ఎదురుదాడికి దిగిన ఈ ఇద్దరు సత్ఫలితాన్ని సాధించారు. ముఖ్యంగా బ్రూక్ తొలుత రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌తో సత్తా చాటాడు. అలాగే బట్లర్ కూడా బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు ఈ జంట 48 పరుగులు జోడించింది. ఈ దశలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కమాల్ చేశాడు. ఒకే ఓవర్లో బ్రూక్‌తో పాటు లియామ్ లివింగ్ స్టన్‌ను డకౌట్ చేసి షాకిచ్చాడు. ముందుగా చక్రవర్తి వేసిన బంతి కాస్త ఎక్కువగా రిఫ్ట్ అయ్యి బ్రూక్ బ్యాట్ అండ్ ప్యాడ్ గ్యాప్‌లో నుంచి బయటకు వచ్చి, వికెట్లను గిరాటేసింది. అంతకు ముందు ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఆ తర్వాత తను ఎదుర్కొన్న రెండో బంతికే లివింగ్ స్టన్ పెవిలియన్‌కు చేరాడు. బంతిని డ్రైవ్ చేయడానికి లివింగ్ స్టన్ ప్రయత్నించగా, బంతి టర్న్ అయ్యి, వికెట్లకు తాకింది. దీంతో నాలుగో వికెట్‌ను ఇంగ్లాండ్ కోల్పోయింది. ఒకవైపు బట్లర్ ఒంటరి పోరాటం చేస్తూ 34 బంతుల్లోనే అర్థ సెంచరీ చేయగా, అతనికి సహాకారం అందిచేవారు కరువయ్యారు. స్లోగా ఆడిన జాకబ్ బెతెల్ (14 బంతుల్లో 7)ను హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించాడు. బంతిని పుల్ చేసి అభిషేక్ శర్మ చేతికి చిక్కడంతో బెతెల్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 


Also Read: Ind Vs Eng T20 Series: టాస్ గెలిచిన భారత్ - బౌలింగ్ ఎంచుకున్న సూర్యసేన, స్టార్ ప్లేయర్‌కు షాక్