Several Passengers Died Due To Hit By Karnataka Express: మహారాష్ట్రలోని (Maharastra) జల్గావ్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని 12 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పుష్పక్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వ్యాపించినట్లు వదంతులు వ్యాపించగా.. భయంతో ప్రయాణికులు చైన్ లాగారు. అనంతరం కిందకు దిగి పట్టాలు దాటుతున్న క్రమంలో పచోరా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలు వీరిపైకి దూసుకొచ్చి ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
'అందుకే పుష్పక్ ఆగింది'
అటు, ఈ ఘటనపై సెంట్రల్ రైల్వే స్పందించింది. 'ప్రయాణికులు చైన్ లాగితే లఖ్‌నవూ - ముంబయి ఎక్స్‌ప్రెస్ (పుష్పక్ రైలు) ఆగింది. రైలు ఆగాక ఒక బోగీ నుంచి కొందరు ప్రయాణికులు దిగారు. వారిని మరో ట్రాక్‌లో వెళ్తోన్న బెంగుళూరు - కర్ణాటక రైలు ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు పంపాం.' అని పేర్కొంది.
పుష్పక్ ఎక్ర్‌ప్రెస్ రైలులోని ఒక కోచ్‌లో హాట్ యాక్సిల్ లేదా బ్రేక్ బైండింగ్ కారణంగా నిప్పురవ్వలు చెలరేగాయని అధికారి ఒకరు తెలిపారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగారని.. కొందరు ట్రాక్‌లపై దూకేసిన సమయంలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు.
సీఎం దిగ్భ్రాంతి
రైలు ప్రమాద ఘటనపై సీఎం ఫడణవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 'నా మంత్రివర్గ సహచరుడు గిరీశ్ మహాజన్, జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం రైల్వే అధికారులతో సమన్వయం చేస్తూ పనిచేస్తోంది. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన సహాయాన్ని వెంటనే అందిస్తున్నాం.' అని పేర్కొన్నారు.