Tax Saving Options: మార్చి నెల సమీపిస్తున్న కొద్దీ, ఆదాయ పన్ను చెల్లింపుదార్లు పన్ను ఆదా చేసే మార్గాలు & ఆప్షన్ల కోసం వెతకడం ప్రారంభిస్తున్నారు. ఏ పథకం మంచిదో తెలుసుకోవడమే కాదు, మీకు అవసరమైనప్పుడు నగదును విత్‌డ్రా చేసుకోవడం కూడా ముఖ్యమే. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఉన్న టాక్స్ సేవింగ్ ఆప్షన్స్‌లో 'ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్' (ELSS) మెరుగైన ఎంపిక అని ఆదాయ పన్ను నిపుణులు చెబుతున్నారు.
ELSS ద్వారా సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షలు ఆదా చేయడంతో పాటు, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ద్వారా సెక్షన్ 80CCD కింద రూ. 50,000 కాంట్రిబ్యూషన్స్‌పై అదనపు పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్
NPS, ELSS, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ (LIC) వంటి వివిధ పన్ను ఆదా పథకాలలో బెటర్ ఆప్షన్ ఏది అని ప్రశ్నించినప్పుడు, ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ చింతక్ షా చెప్పిన సమాధానం.. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS). దీనిని ఎంపిక చేసుకోవడానికి రెండు కారణాలు ఉన్నట్లు చింతక్ షా వెల్లడించారు. మొదటిది, ELSS పెట్టుబడులు నేరుగా స్టాక్ మార్కెట్‌లకు అనుసంధానమై ఉంటాయి. చారిత్రాత్మకంగా చూస్తే, ఏడాదికి 11 శాతం నుంచి 12 శాతం వరకు దీర్ఘకాల రాబడిని అందిస్తాయి. రెండోది, ELSS కింద 'లాక్ ఇన్ పీరియడ్' మూడు సంవత్సరాలు మాత్రమే. అంటే మూడేళ్ల తర్వాత మీరు మీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనివల్ల, ఆ డబ్బును ఏదైనా అవసరం కోసం వాడుకోవచ్చు లేదా సెక్షన్ 80C ప్రయోజనాలు పొందేందుకు కొత్త ELSSలో తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు అని షా చెప్పారు. సంపద సృష్టి నుంచి పన్ను ఆదా వరకు ఉన్న ప్రయోజనాలు ELSSను ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మార్చిందని తెలిపారు.
NSC, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), NSC వంటి ఉత్పత్తులపై వడ్డీ స్థిరంగా ఉంటుంది, ప్రతి మూడు నెలలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ELSS వంటి ప్రొడక్ట్స్ దీనికి భిన్నంగా ఉంటాయి. ఈ ఉత్పత్తులపై రాబడి స్థిరంగా ఉండదు, వాటి పనితీరు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే NPS సెక్షన్ 80CCD కిందకు వస్తుంది, అదనపు పన్ను ప్రయోజనం కల్పిస్తుంది.
PPF లాక్-ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు, NSC లాక్-ఇన్ పీరియడ్ ఐదు సంవత్సరాలు. సుకన్య సమృద్ధి యోజన కింద, 'లాక్ ఇన్ పీరియడ్' అనేది అమ్మాయికి 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఉంటుంది. LICలో, పాలసీ మెచ్యూరిటీ పీరియడ్ వరకు వెయిట్ చేయాలి. వడ్డీ రాబడి గురించి మాట్లాడుకుంటే... ప్రస్తుతం PPFలో 7.10 శాతం, NSCలో 7.70 శాతం, సుకన్య సమృద్ధి యోజన కోసం 8.20 శాతం, LIC విషయంలో 5-6 శాతం ఉంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్
పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA రిపోర్ట్ ప్రకారం.. NPS కింద ఈక్విటీలో పెట్టుబడి ప్రారంభం నుంచి దాదాపు 12 శాతంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎన్‌పీఎస్ రాబడి 9.40 శాతం వరకు ఉంది. పన్ను చెల్లింపుదారులు, స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు వచ్చిన నష్టాన్ని కూడా క్లెయిమ్ చేయవచ్చు. ఇది ఇతర మూలధన లాభాలపై పన్ను బాధ్యతను తగ్గిస్తుంది.
స్పష్టీకరణ: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. ఫలానా చోట పెట్టుబడి పెట్టాలని 'abp దేశం' ఎప్పుడూ సలహా ఇవ్వదు.
మరో ఆసక్తికర కథనం: భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ అధిక సుంకాలు విధిస్తే మన దేశం రియాక్షన్ ఎలా ఉండాలంటే?