CM Revanth Reddy Davos Tour: తెలంగాణలో రవాణా రంగ అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచ స్థాయి రవాణా మౌలిక సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పటిష్ఠ ప్రణాళికలు రూపొందించిందని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు, మౌలిక వనరుల అభివృద్ధి సంస్థలు కలిసి రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టాలని, ఈ రంగాన్ని మరింత విస్తరించి తెలంగాణను దేశానికి మోడల్ రాష్ట్రంగా మార్చేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణలో రవాణా విప్లవం
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. 4 కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందని హామీ ఇచ్చారు.
ఈవీ వాహనాలకు ప్రోత్సాహం
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వాహనాల (EV) వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విద్యుత్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను రద్దు చేయడం ద్వారా ఈ రంగానికి ప్రోత్సాహం అందజేస్తోంది. దేశవ్యాప్తంగా ఈవీ వాహనాల విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయడంలో అర్బన్ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. కోటి 20 లక్షలకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న మెట్రో రైల్ నెట్వర్క్‌ను మరింత విస్తరించేందుకు కొత్తగా 100 కిలోమీటర్ల మెట్రో లైన్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్‌లో పర్యావరణ అనుకూల రవాణా సేవల విస్తరణలో భాగంగా, 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను నగర రోడ్లపై నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీని ద్వారా రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించడంలో కీలక ముందడుగు వేయబోతోంది.
డ్రైపోర్ట్ ద్వారా కొత్త అవకాశాలు
తీరప్రాంతం లేని తెలంగాణ రాష్ట్రానికి వాణిజ్య రంగంలో లోటు ఏర్పడకుండా, కొత్తగా డ్రైపోర్టును నిర్మించి రాష్ట్రాన్ని వేర్‌హౌజ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వస్తోంది. ఈ డ్రైపోర్టును ఏపీలోని మచిలీపట్నం పోర్టుతో ప్రత్యేక రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానం చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సదుపాయాలను అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ కాలుష్యంతో, వేగంగా ప్రయాణించగల సౌకర్యాలే నగర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు.