Breaking News Live Updates: తాడికొండ పవర్ సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పవర్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. తాడికొండ అడ్డరోడ్డులో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
AP Cabinet Meeting: అమరావతి.. ఈ నెల 13న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ తర్వాత జరుగుతున్న మొదటి క్యాబినెట్ భేటీ ఇది.
ఓర్వకల్లు విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓర్వకల్లులోని విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమం కోసం ఆళ్లగడ్డ నియోజకవర్గం, శిరివెళ్ళ గ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయం అందచేస్తారు. అంతకు ముందు జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు చింతా సురేష్, రేఖా గౌడ్, హసీనా బేగం, అర్షద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, అనంతపురం జిల్లా నాయకుడు పెండ్యాల హరి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా శిరివెళ్ళ బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికార పోస్టులు మారాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డిని నియమించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. తితిదే ఏఈవో ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
మదర్స్ డే సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ మదర్స్ డే నాటి నుంచి, తల్లులకు తగిన గౌరవాన్ని, మహిళలందరికీ సమానత్వాన్ని, తల్లిదండ్రులందరికీ ముఖ్యమైన పాత్ర కల్పించడానికి అవసరమైన మద్దతును అందించడానికి మనమంతా కట్టుబడి ఉండాలని నేను ఆశిస్తున్నాను.’’ అని కవిత ట్వీట్ చేశారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ పై పసుపు రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులను మోసం చేసిన అరవింద్ ఇంటి ముందు పసుపు పంట పోసి నిరసన తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ పసుపు రైతులకు చేసిన ద్రోహాన్ని ఆర్టీఐ సమాచారంతో బట్టబయలు చేశారు. దీంతో అరవింద్ ఓట్ల కోసం తమ మనోభావాలతో ఆడుకున్నాడని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ నిజామాబాద్ లో ఎక్కడ పర్యటించినా అడ్డుకుని తీరుతామని పసుపు రైతులు స్పష్టం చేశారు.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలు కాగా, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను స్థానికులు వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Background
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి వాయవ్య దిశగా వేగంగా కదులుతోంది. ఆదివారం మధ్యాహ్నం కల్లా తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ తుపానుగా మారితే ‘అసనీ’గా నామకరణం చేయనున్నారు. మే 10న ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృతుంజయ్ మహపాత్ర తెలిపారు. అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. అల్పపీడనం, తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
తుపాను బలం పుంజుకుని ఉత్తర, పశ్చిమ దిశగా ప్రయాణించి మే 10న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, ఒడిశాలోని గోపాలపూర్ సరిహద్దులో తీరానికి చేరువ కానుంది. తుపాను మారి ఇది దిశను మార్చుకుంటుందా, లేదా బలహీనపడుతుందా అనేది నేటి రాత్రిలోగా తెలిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కోంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేక చోట్ల వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. మత్స్యకారులు రెండు రోజులపాటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. పశ్చిమ బంగాళాఖాతానికి అల్పపీడనం చేరుకున్నాక గాలి తీవ్రత మరింత పెరగనుంది.
అంత ప్రమాదమేమీ లేదు
తాజాగా దక్షిణ అండమాన్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తుపానుగా మారినా తీవ్ర తుపానుగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. మరో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి.
తెలంగాణలో తేలికపాటి జల్లులు..
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మే 10 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో ఎండ తీవ్రత అధికంగా ఉందని, అవసరమైతేనే మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. అధికంగా ఆదిలాబాద్‌లో 43.8 డిగ్రీలు, ఆ తరువాత నిజామాబాద్‌లో 42 డిగ్రీలు, నల్గొండ, రామగుండంలో, హన్మకొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిడుగులు పడి వేర్వేరు చోట్ల ముగ్గురు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నెల్లిపర్తి, బూర్జ మండలం పణుకుపర్త గ్రామాల్లో పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఇందులో ఓ 12 ఏళ్ల బాలిక ఉంది. పిడుగుపాటుకు మరికొందరు అస్వస్థతకు లోనయ్యారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -