ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తయినా.. బాక్సాఫీస్ వద్ద ఇంకా ఆ సినిమా హవా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్‌లో కాస్త తగ్గిందేమో కానీ.. బాలీవుడ్‌లో మాత్రం ‘పుష్పరాజ్’ గాడు వైల్డ్ ఫైర్ అంటే ఏంటో చూపిస్తున్నాడు. ‘పుష్పరాజ్’గాడి ప్రభంజనానికి బాలీవుడ్ దాసోహం అవుతోంది. ఎంతగా అంటే.. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ సైతం ట్విట్టర్‌లో పుష్పరాజ్ సునామీకి సలామ్ కొట్టేంతగా. అవును.. పుష్పరాజ్ కలెక్షన్ల తాండవం చూసిన యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఎక్స్ వేదికగా చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపింది. యష్ రాజ్ ఫిల్మ్స్‌తో పాటు ఇప్పుడు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా ‘పుష్ప 2 ది రూల్’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ఆ సినిమాను ఎక్కడో నిలబెట్టింది.
అంతే కాదు, పనిలో పనిగా బాలీవుడ్ హీరోలకు కూడా చురకలు అంటించింది. ఇంతకీ ఆమె ఏమని అందంటే... ‘‘పుష్ప 2 తరహా చిత్రం బాలీవుడ్ నటులెవరూ చేయలేరు. ఎందుకంటే వారికి సిక్స్ ప్యాక్ అబ్స్, హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటమ్ నంబర్లు ఉంటే చాలని అనుకుంటున్నారు. అంతకు మించి వారు బయటికి రాలేకపోతున్నారు. కంఫర్ట్ జోన్ చూసుకుంటున్నారు తప్పితే.. రియాలిటీలోకి రాలేకపోతున్నారు. ఇది మాకు చాలు అనే భ్రమలోనే ఉన్నారు. అందుకే ఇతర సినీ ఇండస్ట్రీలు బాలీవుడ్‌ని డామినేట్ చేస్తున్నాయి’’ అంటూ తనదైన తరహాలో కంగనా రనౌత్ విమర్శలు గుప్పించింది. ఆమె అందని కాదు కానీ.. కొన్నాళ్లుగా బాలీవుడ్ పరిస్థితి ఏంటనేది అందరికీ తెలిసిందే. సరైన హిట్‌లేని బాలీవుడ్‌కు ఈ మధ్య సౌత్ డైరెక్టర్లే అక్కడ కూడా సినిమాలు తీసి హిట్స్ ఇవ్వడం విశేషం. అలాగని బాలీవుడ్‌లో మంచి డైరెక్టర్స్, హీరోలు లేరా? అంటే ఎందుకు లేరు? కానీ వారంతా ఇప్పుడు కంఫర్ట్ జోన్‌లో మాత్రమే సినిమాలు చేస్తున్నారనేలా కంగనా వ్యాఖ్యలు ఉన్నాయి.
Also Read: సీఎంను కలిశా... అల్లు అర్జున్ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్ రాజు
ఇక ‘పుష్ప2’ సినిమా విషయానికి వస్తే.. నార్త్ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. వందేళ్ల బాలీవుడ్ హిస్టరీని ఒక తెలుగు సినిమా బద్దలు కొట్టిందంటే.. అక్కడ ‘పుష్పరాజ్’ రూలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిందీ బెల్ట్‌లో ఈ సినిమా 19 రోజుల్లో రూ. 704. 25 కోట్ల నెట్ కలెక్షన్లతో రికార్డ్స్ రపా రపా లాడిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. మరో వైపు ఈ సినిమా ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్ కేసుల బారిన పడ్డారు. ఇటీవల ఆయన నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌తో విడుదలవగా.. ఇంకా ఆ విషయం హాట్ టాపిక్‌గానే టాలీవుడ్‌లో నడుస్తుంది. మంగళవారం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో.. అల్లు అర్జున్ ఈ కేసు నుండి ఎలా బయటపడతాడా? అని ఇండస్ట్రీ సైతం ఆతృతగా ఎదురు చూస్తోంది.
Also Read: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!