Dil Raju Reaction On Allu Arjun Case: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో భార్యను కోల్పోయిన భాస్కర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు సినీ పరిశ్రమ, ప్రభుత్వం రెండూ ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే కొంత సాయం అందించారు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని శాశ్వతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా భరోసా ఇవ్వబోతున్నట్టు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు చెప్పారు. దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు.
రేవతి కుమారుడు చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించిన దిల్‌రాజు... భాస్కర్‌కు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్తకు ఓకే అంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉద్యోగం ఇస్తామన్నారు. ఇప్పటికే ఆయన ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు. ఆయన ఓకే అంటే ఉద్యోగంపై అటు సీఎంతో, మాట్లాడతాను అన్నారు. దీని కంటే బెటర్‌గా ఏం చేయాలో అన్నది కూడా సీఎంతో చర్చిస్తానన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఇంకా కోలుకుంటున్నాడని తెలిపారు. వెంటిలేటర్ సహాయం లేకుండానే ఐసీయూలో ఉన్నాడని వివరించారు. త్వరగా ఆ బాలుడు కోలుకుంటే అన్నీ సర్దుకుంటాయని పేర్కొన్నారు.
థియేటర్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు దిల్ రాజు. గతంలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయని కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఇప్పుుడు జరిగిన దానిపై అందరూ బాధతో ఉన్నామని అయితే ఇందులో తప్పు ఒప్పులు పక్కన పెడితే ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటామనే విషయంపై చర్చిస్తున్నామని అన్నారు. అటు ప్రభుత్వం, ఇటు సినిమా పరిశ్రమ కూడా అదే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు.
సినిమా పరిశ్ర, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందనే కథనాలు సరికాదని దిల్ రాజు సూచించారు. రెండూ కూడా ఒకే ఆలోచనతో ఉన్నాయని రేపో ఎల్లుండో సీఎంతో కలుస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే ఒకసారి రేవంత్ రెడ్డితో మాట్లాడినట్టు వివరించారు. సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో చెప్పామని అన్నారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలు తీర్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాను కలిశానని... ఆయన చెప్పిన విషయాలు మీడియాకు వివరించానని చెప్పారు. సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి గ్యాప్ లేదని అన్నారు. త్వరలోనే అందరూ కూర్చొని మాట్లాడుకొని సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించుకుంటామన్నారు. సీఎంతో త్వరోలనే మీటింగ్ ఉంటుందని చెప్పారు.