Sandhya Theater Incident | హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతరం అల్లు అర్జున్ వరుస ప్రెస్ మీట్లపై చిక్కడపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా నటుడు అల్లు అర్జున్‌కు నోటీసులివ్వగా.. మంగళవారం నాడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు నటుడు హాజరయ్యారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సీఐ రాజులు నటుడు అల్లు అర్జున్‌ను దాదాపు 20 ప్రశ్నలు అడిగి ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసుకుంటున్నారు. లాయర్ సమక్షంలో అల్లు అర్జున్ విచారణ జరుగుతోంది.
పీఎస్‌లో విచారణ పూర్తయ్యాక పోలీసులు అల్లు అర్జున్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌కు తీసుకెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. ఆరోజు తొక్కిసలాట ఘటన ఎలా జరిగింది, థియేటర్ వచ్చిన ఆయన ఎక్కడ కూర్చున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందన్న దానిపై పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాలని భావిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగి ఓ మహిళ ప్రాణం పోయింది థియేటర్ వద్దే కనుక, అక్కడికి తీసుకెళ్లి కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
అల్లు అర్జున్‌ను పోలీసులు సంధ్య థియేటర్‌కు తీసుకెళతారా అనే ప్రశ్నపై ఆయన లాయర్లు స్పందించారు. విచారణలో అల్లు అర్జున్ చెప్పే విషయాలు సరిగా లేవని భావిస్తే పోలీసులు సంధ్య థియేటర్ వద్దకు తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. విచారణలో అల్లు అర్జున్ పొంతలేని సమాధానాలు చెబితే మాత్రం సీన్ రికన్‌స్ట్రక్షన్ పేరిట థియేటర్ కు తీసుకెళ్లి కొన్ని విషయాలపై మరోసారి ప్రశ్నించనున్నారు. పోలీసులు ఏం ప్రశ్నలు అడుగుతున్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
1. పుష్ప -2 స్పెషల్ ప్రీమియర్ షో చూసేందుకు సంధ్య థియేటర్‌కు రావడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకున్నారు ?
2. పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సంధ్య థియేటర్ యాజమాన్యం నుంచి సమాచారం వచ్చిందా? లేదా?
3. సంధ్య థియేటర్ వద్ద రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా?
4. ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయారని థియేటర్లో ఉన్నప్పుడు తెలుసా ?
5. మీ బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందిన వారు, వారు ప్రజలను, పోలీసులను నెట్టివేయడం కరెక్టేనా?